వారణాసి: రాముడిగా.. మహేశ్ లుక్ అదుర్స్!
ABN , Publish Date - Feb 23 , 2026 | 11:47 AM
దర్శక ధీరుడు రాజమౌళి.. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తెరకెక్కిస్తున్న వారణాసి చిత్రంలో మహేశ్ పాత్ర గురించి ఓ అప్డేట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli) కలయికలో రూపొందుతున్న భారీ అడ్వెంచర్ డ్రామా 'వారణాసి' (Varanasi). 'ట్రిపుల్ ఆర్' వంటి అంతర్జాతీయ స్థాయి విజయం తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న తదుపరి చిత్రం కావడంతో, భారతీయ సినిమా రంగానికి ఇది మరో గర్వకారణంగా మారుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర బృందం పనులను శరవేగంగా పూర్తి చేస్తోంది.
ఈ సినిమాలో మహేశ్ బాబు సరికొత్త మేకోవర్‌తో కనిపించనున్నారు. ఇందులో ఆయన 'రుద్ర' తోపాటు 'శ్రీరాముడు' అనే రెండు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నారు. మహేశ్ కెరీర్‌లోనే అత్యంత ఛాలెంజింగ్ పాత్రలుగా ఇవి నిలుస్తాయని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాజమౌళి మార్కు విజువల్ వండర్‌గా ఈ పాత్రలు ఉండబోతున్నాయి.

తాజాగా గుంటూరులోని మైత్రీ సినిమాస్ వద్ద మహేశ్ బాబు రాముడి గెటప్‌లో ఉన్న ఒక డిజిటల్ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. చేతిలో ధనుస్సు పట్టుకుని, గంభీరమైన ముద్రతో ఉన్న మహేశ్ రూపం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ లుక్ పట్ల రాజమౌళి సైతం స్పందిస్తూ, తనకు 'గూస్‌బంప్స్' వచ్చాయని ప్రశంసించడం విశేషం.
ఈ చిత్రంలో హీరోయిన్‌గా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka chopra) నటిస్తోంది. ఆమె రాకతో ఈ ప్రాజెక్టుకు ఇంటర్నేషనల్ గా క్రేజ్ వచ్చింది. వీరితోపాటు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj ) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇంతటి భారీ తారాగణం ఉండటం సినిమా స్థాయిని మరింత పెంచింది.
ఆస్కార్ విజేత ఎం. ఎం. కీరవాణి (M. M. Keeravani) ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. రాజమౌళి సినిమాల్లో సంగీతం ప్రాణవాయువు వంటిదని ప్రతి ఒక్కరికీ ఎరుకే. ఆయన అందించే నేపథ్య సంగీతం ఈ 'వారణాసి' నేపథ్యానికి అద్భుతమైన వన్నె తెస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. పాటలు సైతం అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండబోతున్నాయని సమాచారం.
భారీ బడ్జెట్, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీతో రూపొందుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగు సినిమా సత్తాను మరోసారి ప్రపంచ వేదికపై చాటిచెప్పేలా ఈ సినిమా ఉండబోతోంది. దీంతో అభిమానులు వచ్చే యేడాది ఏప్రిల్ 7 కోసం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.