మహేష్ బాబు మేనల్లుడి పెళ్లి.. కొరియా అమ్మాయితో ఏడడుగులు
ABN, Publish Date - Nov 25 , 2026 | 06:21 PM
మహేష్ బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్ తనయుడు సిద్దార్థ్ గల్లా వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. కొరియాకు చెందిన తన ప్రేయసి హ్యైన్ కిమ్‌ను వియత్నాంలోని ఫూ క్వోక్ ద్వీపంలో వివాహం చేసుకున్నాడు.
మాజీ పార్లమెంట్ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ (Galla Jayadev) తనయుడు, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు సిద్దార్థ్ గల్లా (Siddharth Galla) వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. కొరియాకి చెందిన తన చిరకాల ప్రేయసి హ్యైన్ కిమ్ (Hyun Kim) తో కలిసి ఆయన ఏడడుగులు వేశాడు. వియత్నాంలోని అత్యంత రమణీయమైన పర్యాటక ప్రాంతమైన ఫూ క్వోక్ ద్వీపంలో నీలి సముద్రపు అలల సవ్వడి, కనువిందు చేసే ప్రకృతి అందాల నడుమ వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ ఎంతో వైభవంగా, కన్నుల పండువగా జరిగింది. ఎలాంటి ఆడంబరాలకు పోకుండా, కేవలం ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఎంతో ఆత్మీయంగా ఈ వివాహ వేడుకను నిర్వహించారు.
వేర్వేరు దేశాలు, భిన్న సంస్కృతులకు చెందిన రెండు హృదయాలు ఒక్కటైన ఈ అపురూప ఘట్టం గల్లా కుటుంబంలో నూతన ఆనందాన్ని నింపింది. బీచ్ రిసార్ట్ వాతావరణంలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన దృశ్యాలు, నూతన వధూవరుల ఆకర్షణీయమైన లుక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సిద్దార్థ్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో మహేష్ భార్య నమ్రత సందడి చేసిన విషయం తెల్సిందే. అయితే ఈ పెళ్లిలో మహేష్ కుటుంబం కనిపించకపోవడం గమనార్హం. మహేష్ బాబు వారణాసి షూటింగ్ లో ఉండడం వలన ఈ పెళ్ళికి హాజరుకాలేదని తెలుస్తోంది. ఇక ఈ జంట ఇండియాకి తిరిగి వచ్చాక ఇక్కడ రిసెప్షన్ ని ఏర్పాటు చేయనున్నారని టాక్. రిసెప్షన్ కి టాలీవుడ్ లోని ప్రముఖులు హజరుకానున్నారని తెలుస్తోంది.
ఇక గల్లా జయదేవ్ పెద్ద కుమారుడు అశోక్ గల్లా హీరో చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెట్టగా, సిద్దార్థ్ గల్లా మాత్రం వ్యాపార రంగంలో రాణిస్తున్నాడు. ఇప్పుడు హ్యైన్ కిమ్‌తో వివాహంతో ఆయన జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. గల్లా కుటుంబంలోకి కొత్త కోడలిగా అడుగుపెట్టిన హ్యైన్ కిమ్‌కు, సిద్దార్థ్ గల్లాకు బంధుమిత్రులు, శ్రేయోభిలాషులతో పాటు మహేష్ బాబు అభిమానులు నెట్టింట హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.