సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఇదే ఈ బాబాయ్- అబ్బాయ్ డెబ్యూ స్పెషాలిటీ!

ABN, Publish Date - Jul 04 , 2026 | 04:41 PM

టాలీవుడ్‌లో పలువురు బాబాయిలు- అబ్బాయిలు ఉన్నారు.. అందరూ జనం మెచ్చినవారే. ఇప్పుడు తన బాబాయ్ మహేశ్ బాబు రూటులో సాగడానికి అబ్బాయ్ జయకృష్ణ వస్తున్నాడు.

Mahesh and Jayakrishna Debut Connection

టాలీవుడ్‌లో పలువురు బాబాయిలు- అబ్బాయిలు ఉన్నారు.. అందరూ జనం మెచ్చినవారే. ఇప్పుడు తన బాబాయ్ మహేశ్ బాబు రూటులో సాగడానికి అబ్బాయ్ జయకృష్ణ వస్తున్నాడు. మిగిలిన అబ్బాయిల కన్నా భిన్నంగా జయకృష్ణ ఎంట్రీ ఇస్తూండడం విశేషం..!

అదే స్పెషాలిటీ..!

తెలుగు చిత్రసీమలో బాబాయ్ - అబ్బాయ్ అనగానే ఒకప్పుడు బాలకృష్ణ- జూనియర్ యన్టీఆర్ ముందుగా గుర్తుకువచ్చేవారు. తరువాత అదే బాలయ్యకు కళ్యాణ్ రామ్, తారకరత్న లాంటి అబ్బాయిలూ వచ్చారు. ఇక బాబాయ్ పవన్ కళ్యాణ్‌కు కూడా రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్ లాంటి అబ్బాయిలు ఉన్నారు. ఆ పై వెంకటేశ్ -రానా కూడా బాబాయ్-అబ్బాయ్‌గా అలరించారు. వారిలాగే ఇప్పుడు మహేశ్ బాబు - ఆయన అన్న రమేశ్ కొడుకు జయకృష్ణ ‘బాబాయ్- అబ్బాయ్’గా ప్రేక్షకులకు గుర్తుండిపోనున్నారు. జయకృష్ణ హీరోగా రూపొందిన తొలి చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ జూలై 30వ తేదీన రిలీజ్ కానుంది. చిత్రమేంటంటే మహేశ్ యంగ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన 'రాజకుమారుడు' సినిమా 1999 జూలై 30వ తేదీనే రిలీజయింది... అలా బాబాయ్ తొలి సినిమా తేదీకే అబ్బాయ్ మొదటి చిత్రం వస్తోందన్నమాట! అదే ఈ బాబాయ్- అబ్బాయ్ స్పెషాలిటీ!


మరింత ప్రత్యేకం..!

బాబాయ్ బంపర్ హిట్ చూసిన సినిమా డేట్స్‌కు అబ్బాయి సినిమా రిలీజ్ చేస్తే హిట్ అవుతుందనే సెంటిమెంట్స్ ఫ్యాన్స్‌కు ఉంటాయి. అలా బాలకృష్ణ బ్లాక్ బస్టర్ హిట్ ‘సమరసింహారెడ్డి’ రిలీజ్ డేట్‌కే అబ్బాయ్ జూనియర్ యన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ విడుదలైన వైనాన్ని సినీ ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. 1999 జనవరి 13న ‘సమరసింహారెడ్డి’ రిలీజ్ కాగా, అదే తేదీన 2016లో అబ్బాయ్ జూనియర్ యన్టీఆర్ హీరోగా రూపొందిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం రిలీజై అలరించింది. ఇలాంటి సంఘటనలు మరికొన్ని కనిపించవచ్చు. అయితే మహేశ్ బాబు - జయకృష్ణ విషయానికి వస్తే వారిద్దరూ హీరోలుగా పరిచయం అయిన సినిమాలు జూలై 30న రిలీజ్ కావడం ఇక్కడి విశేషం. అంతేకాదు ‘రాజకుమారుడు’ చిత్రాన్ని నిర్మించిన వైజయంతీ మూవీస్ అధినేత సి.అశ్వనీదత్ ఇప్పుడు ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాకు నిర్మాణ భాగస్వామి కావడం మరింత విశేషం! అలా బాబాయ్ మహేశ్ - అబ్బాయ్ జయకృష్ణ మరింత స్పెషల్‌గా జనాన్ని ఆకర్షిస్తున్నారు.


ప్రచారపర్వంలో..

మహేశ్ బాబు తొలి నాయికగా ‘రాజకుమారుడు’లో ఉత్తరాది భామ ప్రీతి జింటా కనిపించారు. ఆ తీరునే ఉత్తరాదికి చెందిన రషా తడానీ ఇప్పుడు జయకృష్ణ హీరోయిన్‌గా ‘శ్రీనివాస మంగాపురం’లో తళుక్కుమంటోంది. ‘రాజకుమారుడు’ సినిమా ప్రేమకథతో మొదలై, తరువాత కుటుంబకథగా మారుతుంది. అయితే అజయ్ భూపతి డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘శ్రీనివాస మంగాపురం’ మాత్రం పూర్తిస్థాయి లవ్ స్టోరీగానే జనం ముందు నిలవనుందని తెలుస్తోంది. వాస్తవానికి ఈ చిత్రం జూలై ప్రథమార్ధంలోనే రిలీజ్ కావలసి ఉంది. ఈ మూవీని తగిన రీతిలో ప్రమోట్ చేస్తూ ప్రేక్షకుల ముందు నిలపాలని మేకర్స్ భావించారు. అందుకు జయకృష్ణ బాబాయ్ మహేశ్ కూడా సరే అన్నట్టు తెలుస్తోంది. మరి అబ్బాయి నటించిన ‘శ్రీనివాస మంగాపురం’ ప్రమోషన్స్‌లో బాబాయ్ మహేశ్ పాత్ర ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

అఖిల్ కోసం రంగంలోకి ఎన్టీఆర్? ఇక ఊహించుకోండి!

Varanasi: క్రేజీ ఫొటో.. రాముడిగా మహేష్ బాబు లుక్ ఇదేనా

Bandla Ganesh: సుప్రీం కోర్టును ఆశ్రయిస్తా.. న్యాయం సాధిస్తా..

Updated Date - Jul 04 , 2026 | 04:41 PM