బర్త్‌‌డే స్పెషల్.. నటవారసుల్లో మహేష్ బాబు స్థాయే వేరు!

ABN , Publish Date - Aug 08 , 2026 | 07:58 PM

సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్‌డే అంటే ఫ్యాన్స్‌కు పండగే. ఆగస్ట్ 9న మహేశ్ పుట్టినరోజున ఆయన నటిస్తోన్న ‘వారణాసి’ నుంచి ఏదైనా స్పెషల్ వస్తుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

HBD SSMB

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Super Star Mahesh Babu) బర్త్‌డే అంటే ఫ్యాన్స్‌కు పండగే. ఆగస్ట్ 9న మహేశ్ పుట్టినరోజున ఆయన నటిస్తోన్న ‘వారణాసి’ (Varanasi) నుంచి ఏదైనా స్పెషల్ వస్తుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ కథ ఎలా ఉన్నా మహేశ్ బర్త్‌డేకు కొన్ని స్పెషల్స్ చోటు చేసుకున్నాయి. అవేంటనే విషయానికి వస్తే..

మహేశ్ బాబు బర్త్‌డే ఆగస్ట్ 9న ఏదో ఒక స్పెషాలిటీ చోటు చేసుకొని ఫ్యాన్స్‌కు ఆనందం పంచుతూ ఉంటుంది. మహేశ్ నటించిన పాత చిత్రాలను ఆయన పుట్టినరోజు సందర్భంగా రీ-రిలీజ్ చేయడమన్నది చాలా ఏళ్ళుగా సాగుతోంది. ఈ సారి మహేశ్ బర్త్‌డేకు 2011 నాటి బంపర్ హిట్ మూవీ ‘దూకుడు’ (Dookudu) రీ-రిలీజ్ అవుతోంది. దీంతో అభిమానులు ఆనందంగా చిందులేస్తున్నారు. ఈ సమయంలోనే ‘వారణాసి’ నుంచి మహేశ్ బాబుకు సంబంధించిన ఏదో ఒక గ్లింప్స్ కానీ, స్టిల్స్ కానీ రిలీజ్ అవుతాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇందులో శ్రీరాముని గెటప్‌లో మహేశ్ కనిపిస్తారని విశేషంగా వినిపిస్తోంది. ఒకవేళ ఆ గెటప్‌ను మహేశ్ బర్త్‌డేన రిలీజ్ చేస్తే ఆ సందడి మరో లెవెల్‌లో ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు.


నటవారసుల్లో మహేశ్ బాబు తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. తన తండ్రి నటశేఖర కృష్ణ కన్నా మిన్నగా సక్సెస్ రేటుతో సాగుతున్నారు మహేశ్. అలాగే కృష్ణ (Super Star Krishna) ఏనాడూ ఉత్తమ నటునిగా ప్రభుత్వ అవార్డులు సంపాదించలేదు. మహేశ్ మాత్రం ఇప్పటికి నాలుగు సార్లు బెస్ట్ యాక్టర్‌గా నంది అవార్డులకు ఎన్నికయ్యారు. నటవారసుల్లో ఈ ఫీట్ సాధించిన ఏకైక హీరోగా నిలిచారు మహేశ్. అలాంటి మహేశ్ బాబు తొలిసారి రాజమౌళి వంటి డైనమిక్ డైరెక్టర్ దర్శకత్వంలో ‘వారణాసి’లో నటిస్తున్నారు. దీంతో అభిమానులే కాదు, సినీఫ్యాన్స్ అందరూ ‘వారణాసి’ కోసం వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు రాజమౌళి తన చిత్రాల ద్వారా స్టార్స్‌ను తయారు చేశారు. తొలిసారి రాజమౌళి కూడా ఓ సూపర్ స్టార్‌తో కలసి పనిచేస్తూ ఉండడం విశేషంగా మారింది.


మహేశ్ బాబుతో సినిమా అనగానే రాజమౌళి కూడా ‘వారణాసి’ని ఓ ఛాలెంజింగ్‌గా తీసుకొని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని నిర్మాతలు కార్తికేయ, కె.యల్.నారాయణ కూడా ఏ మాత్రం రాజీపడకుండా నిర్మిస్తున్నారు. అంటార్కిటికాలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ చిత్రంగా ‘వారణాసి’ నిలచింది.. పైగా మూడు యుగాలకు చెందిన కథతో ఈ సినిమా తెరకెక్కడం విశేషం. ఇవే కాకుండా మరిన్ని విశేషాలతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని 120కి పైగా భాషల్లో అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయనున్నారని తెలుస్తోంది. 2027 ఏప్రిల్ 7వ తేదీన ఉగాది కానుకగా ‘వారణాసి’ రానుంది. రాజమౌళి సినిమాలతో ప్రభాస్, జూనియర్ యన్టీఆర్, రామ్ చరణ్ ‘గ్లోబల్ స్టార్స్’గా ఇమేజ్ సంపాదించారు. ఇప్పుడు మహేశ్ కూడా రాజమౌళి సినిమాతో ఇంటర్నేషనల్ స్టార్‌గా సాగుతారని టాలీవుడ్ టాక్. బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వచ్చినా అంగీకరించని మహేశ్.. ‘వారణాసి’ తర్వాత నటించబోయే సినిమాలన్నీ ‘పాన్ వరల్డ్’ మూవీస్‌గానే వస్తాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఏది ఏమైనా ‘వారణాసి’ ముందు వచ్చిన మహేశ్ బాబు ఈ బర్త్‌డే ఫ్యాన్స్‌కు ఆనందం పంచుతోంది. ఈ ఆనందం ‘వారణాసి’ వచ్చాక ఎన్ని రెట్లు పెరుగుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్ వేడుక ఎక్కడంటే..

ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ ఆలస్యం.. కారణం ఇదేనా!

The Paradise: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభమేలా..

Updated Date - Aug 08 , 2026 | 07:58 PM