ఇటు మహేశ్‌.. అటు రణ్‌బీర్‌.. పాత్ర కోసం కసరత్తులు

ABN , Publish Date - Feb 17 , 2026 | 03:05 PM

వెండితెరపై  పురాణ పాత్రలు పోషించడం అంటే ఆషామాషీ విషయం కాదు. అందులోనూ రాముడి పాత్రను పోషించాలంటే శారీరకంగా, మానసికంగా చాలా సన్నద్ధమవ్వాలి. అలాంటి మహత్తరమైన పాత్రను పోషించే అవకాశం నటులకు అరుదుగా వస్తుంటాయి. అలాంటి అద్భుత అవకాశం ఇప్పుడు ఇద్దరు హీరోలకు దక్కింది

వెండితెరపై  పురాణ పాత్రలు పోషించడం అంటే ఆషామాషీ విషయం కాదు. అందులోనూ రాముడి పాత్రను పోషించాలంటే శారీరకంగా, మానసికంగా చాలా సన్నద్ధమవ్వాలి. అలాంటి మహత్తరమైన పాత్రను పోషించే అవకాశం నటులకు అరుదుగా వస్తుంటాయి. అలాంటి అద్భుత అవకాశం ఇప్పుడు ఇద్దరు హీరోలకు దక్కింది. దాంతో వెండితెరపై రాముడిగా అలరించడానికి ఆరు నెలల కాల వ్యవధిలో టాలీవుడ్‌ నుంచి మహేశ్, బాలీవుడ్‌ నుంచి రణబీర్‌ కపూర్‌ (Ranbir kapoor) ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ ఇద్దరు రాముళ్లలో ఎవరు అభినయంతో ఆకట్టుకుంటారోనని నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది. అయితే ‘వారణాసి’ చిత్రంలో మహేశ్‌ (Mahesh babu) రాముడిగా (Lord Rama) కనిపించేది చాలా తక్కువ సమయమే. కానీ వాల్మీకీ రామాయణం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ‘రామాయణ’లో రణబీర్‌ పూర్తి స్థాయిలో రాముడిగా కనిపించనున్నారు. దాదాపు రూ. 4 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో ఆ సినిమా రూపుదిద్దుకుంటోంది.  


పూర్తి స్థాయి పాత్రలో..
అందరికీ తెలిసిన రామకథను వెండితెరపై దృశ్యకావ్యంగా మలచబోతున్నట్లు బాలీవుడ్‌ దర్శకుడు నితీష్‌ తివారీ గతంలో ప్రకటించి అందరి దృష్టి తనవైపు తిప్పుకొన్నారు. అందుకు  తగ్గట్లే ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన ‘రామాయణ’ గ్లింప్స్‌తో తన విజన్‌ ఎలాంటిదో అందరికీ పరిచయం చేశారు ఆయన. అంతర్జాతీయ ప్రేక్షకులకు మన ఇతిహాసం గొప్పదనాన్ని పరిచయం చేయడమే లక్ష్యంగా ఆయన ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రణబీర్‌ కపూర్‌ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్‌ రావణుడిగా కనిపించనున్నారు. ఇందులో ఎంతో పవిత్రమైన రాముడి పాత్రను పోషించే అవకాశం రావడం తన అదృష్టంగా భావించి, ఎన్నో నియమాలు పాటిస్తూ ఆ పాత్రలో ఒదిగిపోవడానికి రణబీర్‌ కపూర్‌ కృషి చేశారు. తాత్కాలికంగా మాంసాహారాన్ని మానేసి కేవలం శాఖాహారానికి పరిమితమయ్యారు. శారీరకంగానూ రాముడిలా కనిపించడానికి చాలా కసరత్తులు చేశారు. ఆధ్యాత్మికతను పెంపొందించుకోవడం కోసం ధ్యానం సాధన చేశారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా తొలి భాగం ఈ దీపావళికి విడుదల కానుంది. రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.  


శ్రీరాముడి లుక్‌ కోసం మహేశ్‌ కసరత్తు

ఇప్పటివరకూ యాక్షన్‌.. లవ్‌.. హిస్టారికల్‌..  జానర్స్‌లో సినిమాలు తీశారు దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి. కానీ ఆయన ఇప్పటివరకూ టచ్‌ చేయని జానర్‌ పౌరాణికం. మహేశ్‌బాబు కథానాయకుడిగా ఆయన తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ చిత్రంతో తొలిసారి ఈ ప్రయత్నం చేస్తున్నారు ఆయన. తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘మహా భారతం’కు ముందే ఆయన పౌరాణికంతో ప్రేక్షకులను పలకరిస్తుండడంతో ప్రేక్షకుల్లో అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ‘వారణాసి’లో రామాయణంలోని ఓ ముఖ్య ఘట్టాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు. ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోయే విధంగా ఉంటాయని.. అద్భుతమైన థ్రిల్‌ను పంచుతాయని రాజమౌళి ఓ సందర్భంలో చెప్పారు. అయితే వాటి నిడివి సినిమాలో దాదాపు 25 నిమిషాలు మాత్రమే ఉంటుందట. ఈ సందర్భంలోనే మహేశ్‌ రాముడిగా కనిపించనున్నారు. ఈ తరం కథానాయకుల్లో ప్రభాస్‌ తర్వాత తనకే శ్రీరాముడి పాత్ర పోషించే అవకాశం రావడంతో ఆ పాత్రలో ఒదిగిపోవడానికి ఎంతో కసరత్తు చేశారు మహేశ్‌.
నటన, నడక, లుక్‌ కోసం దాదాపు మూడు నెలలు కష్టపడ్డారు. ఆయన తొలిసారి ఓ పౌరాణిక పాత్రలో కనిపిస్తుండడంతో అభిమానులు ఎంతో ఆశగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. మహేశ్‌ ఇందులో రుద్ర పాత్రలో కనిపించనున్నారు. ‘వారణాసి’ కథాంశం వివిధ టైమ్‌ పీరయడ్లలో జరుగుతుండడంతో ఇందులో ఆయన పోషించే పాత్రలో చాలా షేడ్స్‌ ఉంటాయని తెలుస్తోంది. వచ్చే ఏడాది శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్‌ 7న ‘వారణాసి’ విడుదలవుతోంది.
‘రామాయణ’ హిందీతో పాటు తెలుగులో కూడా విడుదలవుతుంది. అలాగే ‘వారణాసి’ తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్‌ కానుంది. మరి ఈ ఇద్దరు రాముళ్లలో ఎవరు భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకుంటారనేది ఆసక్తికరం.

Updated Date - Feb 17 , 2026 | 03:05 PM