‘మహాకాళి’ గ్లింప్స్ రివ్యూ: శుక్రాచార్యుడి యుద్ధ శంఖారావం.. గూస్‌బంప్స్ పక్కా

ABN , Publish Date - Aug 24 , 2026 | 12:12 PM

‘హను-మాన్’ వంటి గ్లోబల్ సెన్సేషన్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తోన్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం ‘మహాకాళి’ గ్లింప్స్ విడుదలైంది.

Mahakali Glimpse

‘హను-మాన్’ (Hanuman) వంటి గ్లోబల్ సెన్సేషన్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి వస్తోన్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం ‘మహాకాళి’ (Mahakali). ఆర్కేడీ స్టూడియోస్ సమర్పణలో పూజా కొల్లూరు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి ‘శుక్రాచార్యుడి వార్ క్రై’ (Shukracharya's War Cry) పేరుతో సోమవారం మేకర్స్ అదిరిపోయే గ్లింప్స్ వదిలారు. ఈ స్పెషల్ గ్లింప్స్ సినీ ప్రేమికుల్లో సినిమాపై విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘ధురంధర్’ ఫేమ్, బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా ‘శుక్రాచార్యుడు’గా, శ్రియా రెడ్డి ‘మహాకాళి’గా కనిపించిన ఈ గ్లింప్స్ ప్రేక్షకులను ఒక్కసారిగా పౌరాణిక, ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్లింది.


విడుదలైన గ్లింప్స్ విషయానికొస్తే.. ‘‘అమృత మథన సమయంలో దేవతలతో సమానంగా శ్రమించినా.. విష్ణువు అమృతాన్ని కేవలం దేవగణానికే ప్రసాదించాడు.. ఇది ధర్మమా? అధర్మమా?’’ అంటూ అక్షయ్ ఖన్నా పలికిన డైలాగ్స్, ఆయన ఎంట్రీ సీన్.. సినిమా స్థాయిని తెలియజేస్తున్నాయి. 14 లోకాల ద్వారాలను తెరిచి, అసురులకు శాశ్వత విముక్తి కల్పించాలంటూ ‘రక్తబీజుడు’ని మేల్కొల్పి మానవజాతిపైకి యుద్ధానికి పురిగొల్పే సీక్వెన్స్ రోమాంచితంగా సాగింది. అక్షయ్ ఖన్నా ఇంటెన్స్ లుక్, రాక్షస గురువుగా ఆయన స్వాగ్ విజువల్స్‌లో అద్భుతంగా పండాయి.


చివర్లో ఒడిలో పసిబిడ్డను లాలిస్తూనే, ఉగ్రరూపం దాల్చి ఆయుధాలతో దర్శనమిచ్చే ‘మహాకాళి’ అవతారంలో శ్రియా రెడ్డి లుక్, ఆ వెనుకే ‘పెద్దమ్మ చూస్తుందిరా!’ అంటూ వచ్చే టైటిల్ వాయిస్ ఓవర్ అదిరిపోయే హై ఇస్తోంది. అమ్మవారికి శ్రియా రెడ్డిని చూపించిన తీరుని నిజంగా ఎవరూ ఊహించి ఉండరు. అంత చక్కగా ఆమె ఈ పాత్రకు సరిపోయారు. ఓవరాల్‌గా.. ప్రశాంత్ వర్మ విజన్, హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, భారీ నేపథ్య సంగీతం ఈ గ్లింప్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ భారీ దృశ్య కావ్యాన్ని 2027 జనవరి 8న ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ 3Dలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఈ గ్లింప్స్‌లో ప్రకటించారు. రిజ్వాన్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

వరుసగా 200 కోట్ల క్లబ్‌లోకి సూర్య.. ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ పోస్టర్ వైరల్

T-Rex అంటే అర్థమిదేనా శ్రీకాంత్ ఓదెల?.. చిరుని ఏం పోల్చావయ్యా

నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎస్వీబీసీ ఛైర్మన్‌గా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకారం

Updated Date - Aug 24 , 2026 | 12:12 PM