వరుసగా 200 కోట్ల క్లబ్‌లోకి సూర్య.. ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ పోస్టర్ వైరల్
ABN , Publish Date - Aug 23 , 2026 | 11:11 PM
ఇటీవల విడుదలైన ‘వీరభద్రుడు’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకుని బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సూర్య, ఇప్పుడు తాజాగా విడుదలైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ చిత్రంతో మరో సరికొత్త మైలురాయిని అధిగమించారు.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) బాక్సాఫీస్ వద్ద తనదైన వసూళ్ల ప్రభంజనాన్ని సృష్టిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘వీరభద్రుడు’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకుని బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సూర్య, ఇప్పుడు తాజాగా విడుదలైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ (Vishwanath and Sons) చిత్రంతో మరో సరికొత్త మైలురాయిని అధిగమించారు. టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఆదరణ దక్కించుకుంటూ ఏకంగా రూ. 200 కోట్ల గ్రాస్ మార్కును అందుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ విడుదల చేసిన స్పెషల్ సక్సెస్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో వచ్చిన ఈ సినిమాలో సూర్య సరసన మమితా బైజు కథానాయికగా నటించగా, సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రలో మెప్పించారు. స్వచ్ఛమైన కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలతో వెంకీ అట్లూరి తీర్చిదిద్దిన కథాంశం అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు బ్రహ్మరథం పడుతున్నారు.
వరుసగా రెండు చిత్రాలతో రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరిన హీరోగా సూర్య సరికొత్త రికార్డును క్రియేట్ చేయడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. విడుదల చేసిన పోస్టర్‌లో సూర్య పసిబిడ్డను ఎత్తుకుని చిరునవ్వులు చిందిస్తుండగా.. రాధిక, మమితా బైజు సంప్రదాయ వస్త్రధారణలో పక్కన నిలబడి ఉన్న దృశ్యం కుటుంబ కథా చిత్రానికి సరైన ప్రతీకలా నిలిచింది. ‘ఏ హార్ట్‌ఫెల్ట్ బ్లాక్‌బస్టర్’ అంటూ విడుదల చేసిన ఈ పోస్టర్ చూస్తుంటే.. చూసిన వారికి కూడా మరోసారి ఈ సినిమాను చూడాలని అనిపించేలా ఉందంటే నమ్మాలి. తమిళంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ చిత్రం లాంగ్ రన్‌లో మరిన్ని రికార్డులను కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
T-Rex అంటే అర్థమిదేనా శ్రీకాంత్ ఓదెల?.. చిరుని ఏం పోల్చావయ్యా
నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎస్వీబీసీ ఛైర్మన్‌గా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకారం
‘జనవరి 12 విడుదల’.. అనిల్ ఇవ్వబోతోన్న స్పెషల్ సర్‌ప్రైజ్ ఏంటి?