సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో.. సస్పెన్స్ థ్రిల్లర్ ‘M4M'

ABN, Publish Date - May 04 , 2026 | 09:54 PM

అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో, మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ M4M.

M4M

అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో, మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘M4M (Motive For Murder)’ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం, PVR Inox Pictures ద్వారా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతోంది. విడుదలకు ముందుగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ చిత్రంపై ఆసక్తిని మరింత పెంచింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకుల సంఘం అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, సీనియర్ దర్శకుడు వి. సముద్ర హాజరై టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న దర్శకుల దినోత్సవం నాడు ఈ వేడుక జరగడం ప్రత్యేకంగా నిలిచింది.

వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ మోహన్ వడ్లపట్లలో ఉన్న ప్రతిభను ప్రశంసిస్తూ, ఈ చిత్రం టీమ్ కృషి తెరపై స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. జో శర్మకు మంచి భవిష్యత్తు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని , మోహన్ వడ్లపట్ల మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని వి. సముద్ర తెలిపారు.

TFDA కార్యదర్శి పెండ్యాల మాట్లాడుతూ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందని, సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్ ఆకట్టుకునేలా ఉందని అన్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తీసుకురావడం అభినందనీయం అని అన్నారు. హీరోయిన్ జో శర్మ తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు దర్శకుడికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో కృషి చేసినట్లు చెప్పారు. ఇప్పటికే ఈ చిత్రానికి 15కిపైగా అంతర్జాతీయ అవార్డులు లభించాయని వెల్లడించారు.

దర్శక-నిర్మాత మోహన్ వడ్లపట్ల సినిమా కథపై ఆసక్తిని పెంచేలా మాట్లాడుతూ, ఇందులోని సీరియల్ కిల్లర్‌ను గుర్తించిన వారికి లక్ష రూపాయల బహుమతి ప్రకటించారు. క్లైమాక్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని, కొత్త అనుభూతిని అందించే ప్రయత్నం చేశామని తెలిపారు. మరో నటుడు MRC వడ్లపట్ల మాట్లాడుతూ, ఈ చిత్రానికి జో శర్మ ప్రధాన ఆకర్షణగా నిలుస్తారని అన్నారు.

Updated Date - May 04 , 2026 | 09:54 PM