Rashmika Mandanna: సాయి పల్లవి ఔట్.. ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగా రష్మిక?
ABN, Publish Date - Jun 09 , 2026 | 06:17 AM
భారతీయ సంగీత ప్రపంచంలో మధుర గాయని ఎమ్మెస్ సుబ్బులక్ష్మిది ఒక ప్రత్యేక స్థానం.
భారతీయ సంగీత ప్రపంచంలో మధుర గాయని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి (M. S. Subbulakshmi) ది ఒక ప్రత్యేక స్థానం. కర్నాటక సంగీతానికి ‘రాణి’గా ఆవిడను ఆరాధించే వారు ఎందరో: అలాగే భారతరత్న పురస్కారం పొందిన తొలి సంగీత కళాకారిణి కూడా ఆవిడే! ప్రతి రోజూ తన భక్తిగీతాలతో మేలుకొలుపు పాడే ఈ అద్భుతగాయని సుబ్బులక్ష్మి జీవిత కథను తెరకు ఎక్కించే ప్రయత్నం కొంతకాలంగా జరుగుతోంది. ‘జెర్సీ’, ‘కింగ్‌డమ్’ వంటి చిత్రాలను రూపొందించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ బయోపిక్‌కు దర్శకుడు.
తెలుగులో రూపుదిద్దుకొనే ఈ సినిమా గురించి ఇంతవరకూ అధికారిక ప్రకటన రాలేదు. అయినా ఈ బయోపిక్ గురించి ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంది. సుబ్బులక్ష్మి పాత్రకు సాయిపల్లవి (Sai Pallavi)ని ఎంపిక చేశారని మొదట్లో వార్తలు బలంగా వినిపించాయి. ఆ పాత్రలో ఒదిగిపోవడం కోసం ఆమె కర్ణాటక సంగీత సాధన కూడా చేస్తోందని అన్నారు. అయితే ‘రామాయణ’ సినిమాలో సీత పాత్ర పోషిస్తున్న సాయిపల్లవి బిజీగా ఉండడం వల్లనో ఏమో ఆమె కాదు రుక్మిణీ వసంత్ ఆ పాత్ర పోషిస్తారని అన్నారు.
ఇప్పుడు రుక్మిణి (Rukmini Vasanth) కూడా కాదనీ ఆ అద్భుతగాయని పాత్ర పోషించే అవకాశం రష్మిక మందన్న (Rashmika Mandanna) కు లభించిందనీ సినీ వర్గాల సమాచారం. కాస్ట్యూమ్స్ డిజైనర్ నీరజా కోన రూపొందించిన దుస్తులతో రష్మికకు లుక్ టెస్ట్ జరిగిందని తెలిసింది. సుబ్బులక్ష్మి పాత్రను పోషించే నటి ఎవరో ఫైనలైజ్ కావడంతో ఈ బయోపిక్ వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.