Love Story: వాలెంటైన్స్ డే కానుకగా మరోసారి...
ABN, Publish Date - Jan 23 , 2026 | 03:59 PM
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన 'లవ్ స్టోరీ' చిత్రం వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న రీ-రిలీజ్ అవుతోంది. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది.
యువ సమ్రాట్ నాగ చైతన్య (Naga Chaitanya) కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమా 'లవ్ స్టోరీ (Love Story). ఇందులో నాగ చైతన్య తెలంగాణ గ్రామానికి చెందిన ఫోక్ డాన్సర్‌గా పూర్తిగా కొత్త పాత్రలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) చై ని చక్కగా ప్రజెంట్ చేశారు. ఇందులో చై తన నటనలోని భావోద్వేగాలతో అందరినీ కట్టిపడేశాడు. అతని నటనకు విమర్శకులు, ప్రేక్షకులు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు.
హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) సైతం అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. చై, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ, కుల–వర్గ భేదాలను దాటిన వారి ప్రేమ కథ అందరి హృదయాన్ని తాకేలా చేసింది. గ్రామీణ తెలంగాణ జీవనశైలిని నిజాయితీగా, సున్నితంగా తెరపై ఆవిష్కరించారు దర్శకుడు శేఖర్ కమ్ముల. సంగీత దర్శకుడు పవన్ (Pawan) అందించిన 'నీ చిత్రమ్ చూసి', 'సారంగ దరియా' పాటలు సినిమా విడుదలకు ముందే చార్ట్‌బస్టర్స్‌గా మారాయి. ఇప్పటికీ అన్ని ప్రముఖ మ్యూజిక్ ప్లాట్‌ఫార్మ్‌లలో ట్రెండ్ అవుతున్నాయి.
ఇప్పుడు, మేకర్స్ ఈ ఆల్ టైమ్ క్లాసిక్ రొమాంటిక్ మూవీని ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రీ-రిలీజ్ చేస్తున్నారు. కోవిడ్ కాలంలో, 2021లో విడుదలైన ఈ చిత్రం సవాళ్లను దాటుకొని బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని ఒక ప్రేమకావ్యంగా తీర్చిదిద్దారు.