Akhil Akkineni: 'లెనిన్' సక్సెస్.. అఖిల్ ముందు పెద్ద సవాల్?
ABN, Publish Date - Jul 21 , 2026 | 05:33 PM
ఒక నటుడికి ఇండస్ట్రీలో విజయం దక్కడం అంటే కేవలం వసూళ్లు రావడం మాత్రమే కాదు, అది నిర్మాతుల్లో భరోసాను, దర్శకుల్లో నమ్మకాన్ని, ప్రేక్షకుల్లో విపరీతమైన ఉత్సాహాన్ని నింపుతుంది.
ఒక నటుడికి ఇండస్ట్రీలో విజయం దక్కడం అంటే కేవలం వసూళ్లు రావడం మాత్రమే కాదు, అది నిర్మాతుల్లో భరోసాను, దర్శకుల్లో నమ్మకాన్ని, ప్రేక్షకుల్లో విపరీతమైన ఉత్సాహాన్ని నింపుతుంది. లెనిన్ (Lenin) సినిమా ఘనవిజయంతో అఖిల్ అక్కినేని (Akhil Akkineni) సరిగ్గా అలాంటి స్థితిలోనే ఉన్నారు చెప్పాలి. ఇండస్ట్రీలోకి వచ్చి 10 ఏళ్లు అయినా ఒక సరైన సక్సెస్ కోసం, తన సత్తా నిరూపించుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్న అఖిల్‌కు 'లెనిన్' రూపంలో ఆ డ్రీమ్ బ్రేక్‌త్రూ లభించింది. వెండితెరపై ఆయన చూపించిన నటన, తెచ్చిపెట్టిన ఆ క్రేజ్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త సంచలనం సృష్టించింది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై కింగ్ నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.
'లెనిన్' సాధించిన విజయం కేవలం బాక్సాఫీస్ బొమ్మ మాత్రమే కాదు... తన కెరీర్ అంతటా అఖిల్ వెతుకుతున్న ఆత్మవిశ్వాసాన్ని అతనికి అందించింది. నిన్నటివరకు "గత సినిమాలు ఎందుకు ఆడలేదు? ఎక్కడ పొరపాటు జరిగింది?" అన్న చర్చలు నడిస్తే... ఇప్పుడు అఖిల్ తదుపరి ప్రాజెక్ట్ ఏంటి? తర్వాత రాబోయే వేట ఎలాంటిది? అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. టాలీవుడ్ విశ్లేషకుల నుంచి సామాన్య అభిమానుల వరకు అందరి దృష్టి ఇప్పుడు అఖిల్ పైనే ఉంది.
అయితే ఒక్క హిట్ కొట్టడం ఒకెత్తయితే... ఆ సక్సెస్ జోరును, ఆ ఊపును అలాగే కాపాడుకోవడం మరో పెద్ద సవాలు. ఈ భారీ విజయం తర్వాత ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద మేకర్స్, టాప్ డైరెక్టర్లు మరింత ప్రతిష్టాత్మకమైన కథలతో అఖిల్‌ను సమీపించే అవకాశం ఉంది. ఈ సమయంలో తొందరపడి కథలు ఒప్పేసుకోకుండా, తనకు సరిగ్గా సరిపోయే డిఫరెంట్ కాన్సెప్ట్‌లను ఎంచుకోవడం చాలా ముఖ్యమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఒక్క చిన్న తప్పుడు నిర్ణయం హిట్ కి బ్రేక్ వేయవచ్చు. అదే సరైన ఎంపికైతే ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సరసన అతన్ని స్థిరంగా నిలబెడుతుందని అంటున్నారు.
మరోవైపు ఇప్పుడు అందరి కళ్లూ అఖిల్ రాబోయే సినిమాల పైనే ఉన్నాయి. ఈ సక్సెస్ ఇచ్చిన బూస్ట్‌తో అఖిల్ ఎలాంటి కథలను ఎంచుకోబోతున్నాడు? తన మాస్, క్లాస్ అప్పీల్‌ను ఏ స్థాయిలో చూపించబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. మరి 'లెనిన్' కేవలం ఒక విజయవంతమైన సినిమాగా మిగిలిపోతుందా? లేక అఖిల్ కెరీర్‌ను మలుపు తిప్పి, ఆయనను స్టార్‌డమ్ వైపు నడిపించిన తిరుగులేని ల్యాండ్‌మార్క్‌గా నిలుస్తుందా అనేది చూడాలి.