సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

షావుకారు జానకి మృతి.. టాలీవుడ్ సంతాపం

ABN, Publish Date - Aug 21 , 2026 | 04:24 PM

దక్షిణాది చిత్రసీమలో చెరగని ముద్ర వేసిన సీనియర్ దిగ్గజ నటి షావుకారు జానకి (Sankaramanchi Janaki) (94) ఇకలేరు.

Sowcar Janaki

దక్షిణాది చిత్రసీమలో చెరగని ముద్ర వేసిన సీనియర్ దిగ్గజ నటి షావుకారు జానకి (Sankaramanchi Janaki) (94) ఇకలేరు. గత కొద్ది రోజులుగా వయోభారంతో పాటు తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆమె, చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె మృతితో తెలుగు, తమిళ, కన్నడ చిత్రపరిశ్రమలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. సినీ ప్రముఖులు, అభిమానులు ఆమె మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ నివాళులర్పిస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి చెందిన జానకి, విజయా వారి ఆల్ టైమ్ క్లాసిక్ చిత్రం షావుకారు (1950) ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. ఆ మొదటి సినిమా పేరే ఆమె ఇంటిపేరుగా మారి షావుకారు జానకిగా చిత్రసీమలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. దాదాపు ఏడు పదుల సుదీర్ఘ నటప్రస్థానంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. అలనాటి మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేసన్‌లతో కథానాయికగా ఎన్నో మరపురాని చిత్రాల్లో నటించిన ఆమె, తర్వాతి కాలంలో సహాయ, అత్త, అమ్మమ్మ పాత్రల్లోనూ తనదైన ప్రతిభను కనబరిచారు. చివరగా ఆమె అన్నీ మంచి శకునములే అనే సినిమాలో కనిపించారు. ఆమె పార్థివదేహాన్ని అభిమానులు, ప్రముఖుల నివాళుల కోసం చెన్నైలోని తేనాంపేట్ నివాసంలో ఉంచారు.


ఇక జానకి మరణవార్త తెలియగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మంచు విష్ణు, రాధిక శరత్ కుమార్ సహా టాలీవుడ్, కోలీవుడ్ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, నడిగర్ సంఘం ప్రతినిధులు జానకి మృతికి సంతాపం తెలుపుతూ ఆమె కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని వ్యక్తపరిచారు. ఆమె అందించిన సేవలు భారతీయ సినిమా చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి.

Updated Date - Aug 21 , 2026 | 04:24 PM