కథానాయికలు.. నిర్మాతలగానూ సత్తా చాటుతున్నారు..
ABN, Publish Date - Mar 03 , 2026 | 11:45 AM
చిత్ర నిర్మాణం అంటే సామాన్యమైన విషయం కాదు. అడుగడుగునా సవాళ్లు ఎదుర్కొంటూ, అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ సినిమా తీయాలి. ప్రేక్షకుల్ని మెప్పించాలి. విజయం సాధించాలి.
చిత్ర నిర్మాణం అంటే సామాన్యమైన విషయం కాదు. అడుగడుగునా సవాళ్లు ఎదుర్కొంటూ, అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ సినిమా తీయాలి. ప్రేక్షకుల్ని మెప్పించాలి. విజయం సాధించాలి. ఎందుకొచ్చిన తలనొప్పి ఇదంతా అని చాలా మంది తారలు నిర్మాణ రంగానికి దూరంగా ఉంటుంటారు. హీరోలు సైతం నిర్మాతలుగా మారడానికి వెనుకాడుతున్నతరుణంలో కొంతమంది హీరోయిన్లు ‘మేము సైతం’ అంటూ నిర్మాణ రంగంలోకి (Heroines As Producers) అడుగు పెడుతున్నారు. పాత తరం హీరోయిన్లలో భానుమతి, సావిత్రి, విజయనిర్మల వంటి వారు నిర్మాతలుగానే కాకుండా దర్శకత్వ బాధ్యతలు చేపట్టి మెప్పించారు. నేటి తరం హీరోయిన్లలో కొందరు వాళ్లనే ఫాలో అవుతున్నారనే చెప్పాలి. మేం ఎందులో తక్కువ? అంటూ తమకు నచ్చిన కథలను సినిమాలుగా తీయడానికి ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు.
టాప్ హీరోయిన్‌గా అందరి ప్రేమను గెలుచుకున్న సమంత (Samantha) ఇటీవలే నిర్మాతగా మారారు. ట్రాలాలా మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఇప్పటికే ‘శుభం’ సినిమాను నిర్మించిన సమంత ఇప్పుడు ‘మా ఇంటి బంగారం చిత్రాన్ని నిర్మిస్తూ అందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. యాక్షన్ షేడ్స్ ఉన్న గృహిణి పాత్ర ఆమెది. భర్త రాజ్ నిడుమోరు సపోర్ట్ కూడా ఉండడంతో సక్సెస్‌పుల్‌గా చిత్రాన్ని పూర్తి చేసిన సమంత మే 15న ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
నిర్మాణంతో పాటు దర్శకత్వం
తెలుగు, తమిళ సినిమాల్లో కీలకమైన పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalakshmi Sarathkumar) కూడా నిర్మాతగా మారారు. దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. తొలి ప్రయత్నంగా ‘సరస్వతి’ అనే చిత్రాన్ని తెరకెక్కించి, అందులో ప్రధాన పాత్రను పోషించారు. ఈనెల 6న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వరలక్ష్మి తల్లి, సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ కూడా నిర్మాత అన్న విషయం తెలిసిందే.
మార్పు కోసం కొత్త ప్రయాణం
హీరోయిన్‌గా తన నటనతో ప్రేక్షకులనే కాదు.. విమర్శకులను సైతం మెప్పించి రెండు సార్లు జాతీయ అవార్డును అందుకున్నారు నిత్య మీనన్ (nithya menon). ప్రస్తుతం ఆమె నిర్మాణం వైపు అడుగులేశారు. కేయూరి అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ‘నా దృష్టిలో సినిమాలు తీయడం అంటే ఓ మార్పును తీసుకురావడం’ అని ఓ సందర్భంలో నిత్యా తెలిపారు. త్వరలోనే వైవిధ్యమైన కథలను ఎంచుకుని వాటిని ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు నిత్యమీనన్.
ప్రత్యేక గుర్తింపు
మెగా ఫ్యామిలీ నుంచి నిర్మాణరంగంలోకి అడుగుపెట్టిన మరో మహిళ నిహారిక. నటిగా కొన్ని చిత్రాల్లో నటించిన ఆమె ఇప్పుడు నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆమె నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ ఆర్ధిక విజయం సాధించడమే కాకుండా పలు అవార్డులు కూడా పొందింది. ఇప్పుడు మరో మహిళ మానస శర్మ దర్శకత్వంలో నిహారిక నిర్మించిన హారర్ కామెడీ చిత్రం ‘రాకాస’ విడుదలకు సిద్ధమవుతోంది. సంగీత్ శోభన్ ఇందులో హీరో.
నిర్మాణంపైనే దృష్టి
ఇంతకుముందు చాలా చిత్రాల్లో నటించిన ఛార్మి కౌర్ ఇప్పుడు నటనకు విరామం ఇచ్చి నిర్మాణం మీదే దృష్టి పెట్టారు. దర్శకుడు పూరి జగన్నాథ్‌తో కలసి పూరి కనెక్ట్స్‌పై వరుస చిత్రాలు నిర్మించారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి కథానాయకుడిగా ‘స్లమ్ డాగ్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘చెలియా’, ‘సమ్మోహనం’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అదితి రావు హైదరి కూడా తాజాగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. కళాత్మకత, వైవిధ్యం ఉట్టిపడే చిత్రాలను అందించడమే లక్ష్యంగా ఈ మార్గం ఎంచుకున్నట్లు తెలిపారు.
మరో అగ్రకథానాయిక నయనతార కూడా ఈ రూట్ ఎంచుకోవడం విశేషం. తన భర్త విఘ్నేష్ శివన్‌తో కలసి ‘రౌడీ పిక్చర్స్ బ్యానర్’పై చిత్రాల్ని నిర్మిస్తున్నారు. అలాగే హీరోయిన్లు జ్యోతిక, అమలాపాల్, నజ్రియా నజీమ్, లక్ష్మి మంచు కూడా నిర్మాతలుగా మారిన వారే. సాధారణంగా మహిళలు అంటే డబ్బు విషయంలో చాలా పొదుపుగా ఉంటారు. డబ్బు ఖర్చు పెట్టడానికి ఆచితూచి అడుగులు వేస్తుంటారు. కానీ నిర్మాణరంగంలోకి అడుగుపెట్టిన హీరోయిన్లు మాత్రం క్వాలిటీ కోసం కాంప్రమైజ్ కావడం లేదు. ఖర్చుకు వెనుకాడడం లేదు. అందుకే వీరు నిర్మించే సినిమాలపై ప్రేక్షకులకు ఆసక్తి ఎప్పుడూ ఉంటుంది.