వెంకీ, కళ్యాణ్‌రామ్.. మల్టీస్టారర్ మొదలయ్యేది అప్పుడే
ABN, Publish Date - Mar 24 , 2026 | 03:59 PM
టాలీవుడ్‌లో హిట్ మెషీన్ అంటే అందరూ వెంటనే చెప్పే పేరు అనిల్ రావిపూడి.
టాలీవుడ్‌లో హిట్ మెషీన్ అంటే అందరూ వెంటనే చెప్పే పేరు అనిల్ రావిపూడి (Anil Ravipudi). అపజయమెరుగని ఈ దర్శకుడు, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడంలో దిట్ట. ఈ ఏడాది సంక్రాంతికి మన శంకరవరప్రసాద్ గారి సినిమాతో ఏకంగా 350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచాడు.
కేవలం రీజనల్ సినిమాతోనే ఒక కొత్త బెంచ్ మార్క్‌ను సెట్ చేసిన అనిల్, ఇప్పుడు తన రికార్డును తానే తిరగరాసేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఈసారి ఆయన ఎంచుకున్న అస్త్రం.. ఒక భారీ మల్టీస్టారర్.! అటు విక్టరీ వెంకటేష్ (Venkatesh), ఇటు నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram). ఈ ఇద్దరు హీరోల కాంబినేషన్ అనగానే ఫ్యాన్స్‌లో అప్పుడే పూనకాలు మొదలయ్యాయి.
సాధారణంగా అనిల్ రావిపూడి సినిమాలంటే వినోదానికి గ్యారెంటీ ఉంటుంది. ముఖ్యంగా వెంకటేష్‌తో ఆయన చేసిన F2, F3 సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఏ రేంజ్‌లో అలరించాయో మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా తోడవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిజానికి కళ్యాణ్ రామ్ అంటే పక్కా మాస్ యాక్షన్ హీరో. అనిల్ రావిపూడికి దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చింది కూడా ఆయనే. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన పటాస్ కమర్షియల్‌గా కళ్యాణ్‌రామ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది.
ఇప్పుడు తన ఫేవరెట్ హీరో వెంకటేష్‌తో కలిపి, తన మెంటార్ కళ్యాణ్ రామ్‌ను ఒకే ఫ్రేమ్‌లో చూపించబోతున్నాడు అనిల్. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం, జూన్ నెల నుంచే ఈ క్రేజీ మల్టీస్టారర్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అనిల్ రావిపూడికి బాగా కలిసొచ్చిన సెంటిమెంట్.. సంక్రాంతి! అందుకే, 2027 సంక్రాంతి బరిలో ఈ చిత్రాన్ని నిలపాలనేది మేకర్స్ ప్లాన్.
పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, అనిల్ మార్క్ కామెడీతో అలాగే కళ్యాణ్ రామ్ స్టైల్ యాక్షన్‌తో ఈ చిత్రం ఉండబోతోంది. ఒకవైపు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించే అంశాలు, మరోవైపు మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించే సీన్లు ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయని టాక్. మన శంకరవరప్రసాద్ గారితో క్రియేట్ చేసిన 350 కోట్ల రికార్డును, ఈ మల్టీస్టారర్‌తో అనిల్ తుడిపేస్తాడనే టాక్ కూడా ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తుంది. మరి వెంకీ-కళ్యాణ్ రామ్ జోడీ థియేటర్లలో ఎలాంటి మ్యాజిక్ చేయబోతోంది..? సంక్రాంతి రేసులో ఈ సినిమా ఏ రేంజ్ రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.