Ambica Krishna: రాను రాను ఆంధ్ర యాస పోయి.. తెలంగాణ యాసలోనే సినిమాలు వస్తున్నాయి! గోదావరి యాసకు ప్రాధాన్యం ఇవ్వండి
ABN, Publish Date - Jul 19 , 2026 | 05:48 PM
ప్రముఖ నిర్మాత , వ్యాపారవేత్త అంబికా కృష్ణ తాజాగా సినిమాల విషయంలో చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమపై ఆధారపడిన ఐదు వేల మందిని, పరిశ్రమను బతికించేందుకు అగ్ర హీరోలు తమ సినిమా షూటింగ్‌లో కనీసం ఒక్క షెడ్యూల్ అయినా రాష్ట్రంలో చిత్రీకరించడానికి సహకరించాలని ఎఫ్ఎసీ మాజీ చైర్మన్, సినీ నిర్మాత అంబికా కృష్ణ (Ambhika Krishna) కోరారు. ఏలూరు జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 20 ఏళ్ల తర్వాత నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అమరావతి (Amaravati)లో మలినేని గోపిచంద్ (Gopichand Malineni) దర్శకత్వంలో సినిమా చిత్రీకరణకు క్లాప్ కొట్టిన విషయాన్ని అగ్రహీరోలు గుర్తించాలన్నారు.
తెలుగు రాష్ట్రాల విభజనతో ఏపీలో సినీ పరిశ్రమ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఆయన తెలిపారు. మన రాష్ట్రానికి చెందిన 16 మంది అగ్ర హీరోలు సినిమా చిత్రీకరణలో కనీసం ఒక్క షెడ్యూల్ చిత్రీకరణ ఏపీలో చేపట్టినా పరిశ్రమకు ఊతమిచ్చినట్లేనని చెప్పారు. ఫలితంగా స్థానిక సాంకేతిక నిపుణులకు, కళాకారులకు, కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. రానురాను గోదావరి యాస పోయి తెలంగాణ యాసలోనే సినిమాలు వస్తున్నాయని, గోదావరి యాసకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని అంబికా కృష్ణ కోరారు. నంది అవార్డులను త్వరితగతిన పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేశ్, కందుల దుర్గేష్ కు ఆయన విజ్ఞప్తి చేశారు.
గుర్తింపు కార్డులు అందజేత
ప్రతిభ ఉన్న కళాకారులకు సినిమా ఇండస్ట్రీలో మంచి అవకాశాలు తప్పకుండా లభిస్తాయని ప్రముఖ సినీ నిర్మాత, మాజీ ఎఫెసీ చైర్మన్ అంబికా కృష్ణ అన్నారు. శనివారం ఏలూరులోని ఓ హోటల్లో సినిమా యాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కళాకారులకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు అసోసియేషన్ వ్యవస్థాపకుడు, సినీ నటుడు జి.గౌతమ్ రాజు హాజరై కళాకారులకు గుర్తింపు కార్డులు అందజేశారు.
ఈ సందర్భంగా అంబికా కృష్ణ మాట్లాడుతూ టెలివిజన్, ఓటీటీ వేదికల విస్తరణతో పెద్ద, చిన్న సినిమాలకు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే పరిస్థితి తగ్గిందన్నారు. అయినప్పటికీ ప్రతిభఉన్న కళాకారులను పరిశ్రమ ఎప్పటికీ ఆదరిస్తుందన్నారు. గౌతమ్ రాజు మాట్లాడుతూ సినిమా యాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేసి కళాకారులకు సభ్యత్వం కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కమిటీలు ఏర్పాటు చేశామని, ప్రతిభ కలిగిన కళాకారులను గుర్తించి టీవీ సీరియళ్లు, సినిమాల్లో అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు.