ఫ్యామిలీ ఎంటర్టైనర్.. 'లఫూట్ గ్యాంగ్' షురూ
ABN, Publish Date - May 27 , 2026 | 06:46 PM
అనురాగ్ అధర్వ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లఫూట్ గ్యాంగ్’ చిత్రం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది.
ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న కొత్త చిత్రం “లఫూట్ గ్యాంగ్” హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. 1990ల కాలంలో ఓ హాస్టల్ నేపథ్యంలో సాగే ఈ కథలో యువకుల గ్యాంగ్ చేసే అల్లరి, వారి స్నేహం, సరదా సంఘటనలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని చిత్ర బృందం వెల్లడించింది.
ఈ చిత్రానికి అనురాగ్ అధర్వ రాజు కథ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తుండగా, కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వర్ధన్ మయూర్ కొయ్యాడ సినిమాటోగ్రాఫర్‌గా, ఆర్ఆర్ ధృవన్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. టి.సి. ప్రసన్నకుమార్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా, వెంకటేష్ అత్తిలి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
ప్రారంభ కార్యక్రమానికి దర్శకుడు పవన్ సాధినేని, నిర్మాత బివిఎస్ రవి, హీరోలు రాజ్ తరుణ్, ఆకాష్ పూరి, నటుడు అలీ, రాహుల్ విజయ్, నటి దీప్శిక, అర్చన అయ్యర్, దర్శక నిర్మాత అనిల్ కడియాల తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలీ క్లాప్ కొట్టగా, పవన్ సాధినేని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రాజ్ తరుణ్, ఆకాష్ పూరి చేతుల మీదుగా స్క్రిప్ట్ అందజేశారు.
ఈ చిత్రంలో రాఖి, రిత్విక్, అభినవ్, నందు, ఆంటోనీ కార్తిక్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే పలువురు సీనియర్ నటీనటులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ సందర్భంగా దర్శకుడు అనురాగ్ అధర్వ రాజు మాట్లాడుతూ, “1990ల బ్యాక్‌డ్రాప్‌లో సాగే పూర్తి వినోదాత్మక కథ ఇది. అప్పటి హాస్టల్ జీవితం, యువత గ్యాంగ్ మధ్య జరిగే సరదా సంఘటనలు ప్రేక్షకులను బాగా అలరిస్తాయి” అన్నారు.
నిర్మాత కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, “మా సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. మంచి వినోదాత్మక చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాం” అని తెలిపారు. సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ మాట్లాడుతూ, “ఈ కథలో మంచి ఎమోషన్, వినోదం ఉన్నాయి. ప్రేక్షకులను ఆకట్టుకునే పాటలు, అప్డేట్స్‌తో త్వరలో ముందుకు వస్తాం” అన్నారు.
డీఓపీ వర్ధన్ మయూర్ కొయ్యాడ మాట్లాడుతూ, “కథ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. థియేటర్లలో ప్రేక్షకులు పూర్తిగా ఎంజాయ్ చేసేలా సినిమాను తెరకెక్కించనున్నాం” అని చెప్పారు. నటుడు ఆంటోనీ కార్తిక్ మాట్లాడుతూ, “కొత్త టాలెంట్‌తో రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు గుర్తుండిపోయే ఫుల్ ఎంటర్టైనర్ అవుతుంది” అన్నారు. రిత్విక్, నందు, అభినవ్ కూడా ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించేలా ఉంటుందని తెలిపారు.