'జిగ్రీస్' నటుడికి ఊహించని గుర్తింపు!
ABN, Publish Date - Feb 23 , 2026 | 03:54 PM
'జిగ్రీస్' ఫేమ్ కృష్ణ బూరుగులకు పలు అవకాశాలు వస్తున్నాయి. అయితే కథల ఎంపికలో మాత్రం కృష్ణ రాజీ పడటం లేదని, ఆచితూచి అడుగులు వేయాలనుకుంటున్నాడని సన్నిహితులు చెబుతున్నారు.
గత యేడాది విడుదలైన 'జిగ్రీస్' (Jigris) సినిమా చూసిన వాళ్ళు అందులో కార్తీక్ క్యారెక్టర్ చేసిన కృష్ణ బూరుగులను (Krishna Burugula) అంత తేలికగా మర్చిపోరు. బాల నటుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టి, ఆ పైన పలు చిత్రాలలో నటించిన కృష్ణ బూరుగులకు రవిబాబు దర్శకత్వం వహించిన 'క్రష్' (Crrush) మూవీ నటుడిగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత సునీల్ కుమార్ రెడ్డి డైరెక్ట్ చేసిన 'మా నాన్న నక్సలైట్' (Maa Nanna Naxalite), కొరటాల శివ (Koratala Siva) సమర్పణలో గోపాలకృష్ణ రూపొందించిన 'కృష్ణమ్మ' (Krishnamma) చిత్రాలలో కీలక పాత్రలు పోషించాడు. అలానే 'ఏటీఎం' (ATM) వెబ్ సీరిస్ లోనూ నటించాడు. ఈ చిత్రాలు, వెబ్ సీరిస్‌లతో రాని గుర్తింపు అతనికి 'జిగ్రీస్' మూవీతో వచ్చింది.
గోవా ట్రిప్ నేపథ్యంలో సాగే ఈ ట్రావెలింగ్ ఫన్ డ్రామాతో చిత్రసీమలోని అందరి దృష్టిలోనూ కృష్ణ బూరుగుల పడ్డాడు. దాంతో అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని అంగీకరించకుండా... కృష్ణ బూరుగుల స్క్రిప్ట్స్‌ను ఫిల్టర్ చేస్తున్నాడని తెలుస్తోంది. తన కెరీర్ కు బలమైన పునాది వేసే కథను మాత్రమే అంగీకరించాలని కృష్ణ బూరుగుల భావిస్తున్నాడట. ఇప్పటికే బోలెడన్ని కథలు విన్నా... అవేవీ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సున్నితంగా తిరస్కరించాడని అంటున్నారు. అయితే త్వరలోనే కృష్ణ బూరుగుల తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌తో కెమెరా ముందుకు వస్తాడని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే వరకూ కాస్తంత ఓపిక పట్టాలి... అంతే!