Irumudi: కొమురక్క టూ నాగులు.. క్రెడిట్ మీది సారూ..
ABN , Publish Date - Aug 24 , 2026 | 06:21 PM
నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన ‘జబర్దస్త్’ ఫేం కొమురంకు ‘ఇరుముడి’(Irumudi) సినిమా ఊహించని మలుపునిచ్చింది
నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన ‘జబర్దస్త్’ ఫేం కొమురంకు ‘ఇరుముడి’(Irumudi) సినిమా ఊహించని మలుపునిచ్చింది. రవితేజ (Raviteja) కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో కొమురం పోషించిన ‘నాగులు’ పాత్రకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.సోమవారం జరిగిన సక్సెస్ మీట్‌లో కొమురం భావోద్వేగానికి గురయ్యారు. గత 12 ఏళ్లుగా ‘కొమురక్క’ అనే లేడీ గెటప్‌లోనే ఎక్కువగా కనిపించానని, ఆ పాత్ర తనకు మంచి గుర్తింపు తెచ్చినప్పటికీ.. తనలోని నటుడిని మాత్రం ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో చూపించే అవకాశం రాలేదని చెప్పుకొచ్చారు.
“కొమురక్క లెజెండ్.. కానీ అది నేను కాదు. అదొక గెటప్ మాత్రమే. నాగులు పాత్రతో ఇన్నేళ్లకు నటుడిగా గుర్తింపు లభించింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణకు నా కుటుంబంతో సహా రుణపడి ఉంటాను. కొమరక్కను నాగులుగా మార్చిన ఘనత ఆయనదే . అసలు ఈ షూటింగ్‌కు పిలిచినప్పుడు నాది గే పాత్ర అనుకున్నాను. రవితేజను కొట్టే ఫైట్ ఉందని తెలిసినప్పుడు చెమటలు పట్టాయి. సినిమాలో ఆ సన్నివేశం చూసిన తర్వాత ఏకంగా ఏడు ప్రొడక్షన్ హౌస్‌ల నుంచి తనకు ఫోన్లు వచ్చాయి.‘ఇరుముడి’లోని నాగులు పాత్ర కెరీర్‌ను పూర్తిగామార్చేసింది. కొమురక్క నుంచి నాగులుగాడిని అయిపోయా’’ అంటూ కృతజ్ఞతలు చెప్పారు.