‘కొక్కొరొకో’ నుంచి తొలి పాట విడుదల.. ఆకట్టుకుంటున్న ‘సీతాకోకమ్మ’!

ABN , Publish Date - Nov 17 , 2026 | 01:33 PM

రమేష్ వర్మ నిర్మిస్తున్న ‘కొక్కొరొకో’ సినిమా నుంచి తొలి పాట ‘సీతాకోకమ్మ’ విడుదలైంది. శీను, పార్వతిల ప్రేమను ఆవిష్కరిస్తూ శ్వేతా మోహన్ గాత్రంలో ఈ పాట ఆకట్టుకుంటోంది.

Kokkoroko Movie

ప్రముఖ దర్శకుడు, నిర్మాత రమేష్ వర్మ నిర్మాణ సంస్థ ఆర్వీ ఫిలిమ్స్ నుంచి తొలి ప్రయత్నమైన ‘కొక్కొరొకో’, ఐదు విభిన్న పాత్రలతో కూడిన ఒక ఆంథాలజీ చిత్రంగా రాబోతోంది. ఈ సినిమాతో శ్రీనివాస్ వసంతాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ‘కొక్కొరొకో’ గ్లింప్స్, పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ఫస్ట్ సింగిల్‌గా 'సీతాకోకమ్మ' పాటను మేకర్స్ విడుదల చేశారు.


ప్రధాన పాత్రధారులు శీను, పార్వతిల మధ్య ఉన్న సున్నితమైన ప్రేమను ఒక హృద్యమైన బాణీతో ఈ పాట అందంగా పరిచయం చేస్తుంది. ఎస్. కృష్ణ ప్రసాద్ స్వరపరిచిన ఈ గీతానికి శ్వేతా మోహన్ తన మధురమైన గాత్రంతో ప్రతి స్వరానికి సున్నితత్వాన్ని జోడించారు. ఆస్కార్ పురస్కారం అందుకున్న గీత రచయిత చంద్రబోస్ ప్రేమలోని అమాయకత్వాన్ని ఆవిష్కరించే హృద్యమైన సాహిత్యం ద్వారా ఈ పాటకు అందాన్ని, గొప్ప అర్థాన్ని జోడించారు. ఆహ్లాదకరమైన సంగీతం, సున్నితమైన రొమాంటిక్ టచ్‌తో 'సీతాకోకమ్మ' పాట శ్రోతల హృదయాల్లో నిలిచిపోయేలా ఉంది. ఈ పాట శీనుపై పార్వతికి ఉన్న సంపూర్ణ ప్రేమను మనకు చూపిస్తుంది. అతని పట్ల ఆమెకున్న ఆప్యాయత, ఆరాటం, భావోద్వేగ బంధాన్ని ఇది అందంగా ప్రతిబింబిస్తుంది 'సీతాకోకమ్మ' పాట ప్రేమలోని స్వచ్ఛతను చాటిచెబుతుంది.


ఇది శీను, పార్వతి బంధాన్ని మరింత ఆత్మీయంగా మారుస్తుంది. వారి మధ్య అందమైన కెమిస్ట్రీ ఈ పాటను మరింత ఆకర్షణీయంగా చేసింది. సున్నితమైన దృశ్యాలు, హృద్యమైన భావోద్వేగాలతో, ఈ పాట ఒక అద్భుతమైన ప్రేమకథపై అంచనాలను పెంచుతుంది. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సోదరుడైన జి. వి. సాగర్ ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు. ప్రముఖ రచయిత, స్వర్గీయ సత్యమూర్తి తనయుడైన సాగర్‌ కు 'రాక్షసుడు' తర్వాత మాటల రచయితగా ఇది రెండో సినిమా. లండన్‌కు చెందిన సంగీత ప్రియుడు సంకీర్తన్ సంగీతం సమకూర్చారు. రేఖా వర్మ, కురపాటి శిరీష ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రమేష్ వర్మ కథ, స్క్రీన్ ప్లే అందించారు.

ఇవి కూడా చదవండి:

James Bond 007: కొత్త జేమ్స్‌బాండ్‌.. అదిరిపోయాడు

Diljit Dosanjh: హిందుస్థాన్ ఎవరి సొత్తూ కాదు.. దిల్జీత్ దొసాంజ్ సంచలన వ్యాఖ్యలు

అనిరుధ్ స్వరాలకు..15 వసంతాలు

Updated Date - Nov 17 , 2026 | 01:36 PM