Sai Pallavi: ఆ దర్శకుడు రూట్ మార్చాడు.. సాయి పల్లవితో సినిమా?
ABN, Publish Date - Jul 24 , 2026 | 01:35 PM
గ్లామర్, హడావుడి కంటే పాత్రకు ఉన్న ప్రాధాన్యతకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు సాయి పల్లవి. అందుకే ఆమెను అభిమానులు ప్రేమగా ‘లేడీ పవర్ స్టార్’ అని పిలుస్తారు.
గ్లామర్, హడావుడి కంటే పాత్రకు ఉన్న ప్రాధాన్యతకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు సాయి పల్లవి (Sai Pallavi). అందుకే ఆమెను అభిమానులు ప్రేమగా ‘లేడీ పవర్ స్టార్’ అని పిలుస్తారు. టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును, మార్కెట్‌ను సంపాదించుకున్న ఆమె, ఒకవైపు పెద్ద హీరోల సరసన నటిస్తూనే, మరోవైపు నటనకు మంచి అవకాశమున్న కథానాయిక ప్రాధాన్య చిత్రాలను ఎంచుకుంటూ కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ భారీ ప్రాజెక్ట్ 'రామాయణ'లో రణ్‌బీర్ కపూర్ సరసన సీతగా నటిస్తూ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే, టాలీవుడ్‌లో 'తండేల్' తర్వాత ఆమె మరే కొత్త తెలుగు సినిమాను అధికారికంగా ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే తాజాగా తెలుగులో ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ దర్శకుడు ఎవరో కాదు కిషోర్ తిరుమల (kishore Tirumala).
ఫీల్ గుడ్ డ్రామాలు, భావోద్వేగాల మేళవింపుతో సినిమాలు తీసే దర్శకుడు కిషోర్ తిరుమల, ఈసారి తన మూస పద్ధతిని పక్కన పెట్టి ఒక పవర్ ఫుల్ లేడీ ఓరియెంటెడ్ కథను సిద్ధం చేశారట. 'నేను శైలజ', 'ఆడవాళ్లు మీకు జోహార్లు' వంటి సినిమాలతో కుటుంబ ప్రేక్షకులను అలరించిన ఆయన, ఇటీవల 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'తో మంచి విజయాన్ని అందుకున్నారు. అదే ఉత్సాహంతో పూర్తిగా కథానాయిక చుట్టూ తిరిగే ఒక మంచి కథను రాసుకుని, దానికి సాయి పల్లవి అయితేనే పూర్తి న్యాయం జరుగుతుందని భావించి ఆమెను కలిసినట్లు సమాచారం. ఈ కథలో ఉన్న డెప్త్, నటనకు ఉన్న స్కోప్ చూసి సాయి పల్లవి కూడా ఈ ప్రాజెక్ట్ పట్ల సానుకూలంగా స్పందించినట్లు ఇండస్ట్రీ టాక్. కిషోర్ తిరుమల మార్క్ భావోద్వేగాలకు, సాయి పల్లవి సహజమైన నటన తోడైతే థియేటర్లలో మరో అద్భుతం జరగడం ఖాయమని సినీ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కథకు చివరి మెరుగులు దిద్దుతున్నారని, ఇందులో కథానాయిక పాత్రను రకరకాల కోణాల్లో చాలా కొత్తగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవల సమంత ‘మా ఇంటి బంగారం’ వంటి లేడీ ఓరియెంటెడ్ మూవీతో రూ.100 కోట్లు రాబట్టడంతో, ఇప్పుడు సాయి పల్లవి చేయబోయే ఈ మూవీపై కూడా ట్రేడ్ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీగా హైప్ క్రియేట్ అవుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నటీనటులు, సాంకేతిక బృందం ఎంపిక పూర్తయిన వెంటనే నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కంటెంట్ ఉన్న కథలనే ఎంచుకునే సాయి పల్లవి ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీకి ఓకే చెప్పినట్లు వార్తలు రావడం, కిషోర్ తిరుమల సరికొత్త లైనప్‌లో అడుగుపెట్టడం ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సాయి పల్లవి అభిమానులు మాత్రం ఈ ప్రాజెక్ట్ గురించిన అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.