కిరణ్ అబ్బవరం నుంచి అఖిల్ వరకు.. పెళ్లి తర్వాత బాక్సాఫీస్‌ను షేక్ చేసిన హీరోలు
ABN, Publish Date - Jul 14 , 2026 | 07:16 PM
టాలీవుడ్‌లో మ్యారేజ్ సెంటిమెంట్ హాట్ టాపిక్‌గా మారింది.
సినీ పరిశ్రమలో సెంటిమెంట్లకు అస్సలు కొదవలేదు. ఒక్కోసారి ఒక్కో కొత్త ట్రెండ్ నడుస్తుంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ (Tollywood)లో ఒక ఆసక్తికరమైన సెంటిమెంట్ హాట్ టాపిక్ గా మారింది. అదే.. మ్యారేజ్ సెంటిమెంట్ (Marriage Sentiment). చాలా కాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న హీరోలు, స్టార్స్.. పెళ్లి తర్వాత బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రేంజ్‌లో సాలిడ్ ‘కంబ్యాక్’ ఇస్తున్నారనే కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఇటీవల కాలంలో ఈ సెంటిమెంట్‌ను నిజం చేస్తూ కొందరు సెలబ్రిటీలు సక్సెస్ ట్రాక్ ఎక్కారు.
ఈ సెంటిమెంట్ లో ముందుగా చెప్పుకునే యువ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సమయంలో తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్‌ను ఆయన వివాహం చేసుకున్నారు. పెళ్లి పీటలు ఎక్కిన కొద్ది రోజులకే కిరణ్ నటించిన పిరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘క‘ (Ka Movie) విడుదలైంది. ఈ సినిమా భారీ వసూళ్లతో అద్భుతమైన విజయాన్ని అందుకొని, కిరణ్ కెరీర్‌కు ఊహించని రీతిలో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చింది. ఇక అక్కినేని నాగ చైతన్య వైవాహిక జీవితంలో కొత్త అడుగు వేస్తూ శోభిత ధూళిపాళ్లను వివాహం చేసుకున్న సంగతి మనకు విదితమే.
ఈ పెళ్లి తర్వాత చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య (Naga Chaitanya) నటించిన చిత్రం ‘తండేల్‘ (Thandel). ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ నాగ చైతన్య నటనకు, కెరీర్‌కు ఒక మైలురాయిగా నిలిచి సాలిడ్ కంబ్యాక్‌ను అందించింది. అటు సమంత (Samantha) కూడా తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదొడుకులను అధిగమించి, సరికొత్త మైండ్ సెట్‌తో కెరీర్‌పై పూర్తి ఫోకస్ పెట్టారు. తన సొంత బ్యానర్‌లో పవర్‌ఫుల్ గన్ పట్టి చేసిన ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram) బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఏకంగా రూ. 100 కోట్ల వసూళ్లతో లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. జీవితంలో కొత్త స్ఫూర్తితో అడుగులు వేయడం ఆమెకు బ్రహ్మాండంగా కలిసి వచ్చింది.
మరోవైపు అక్కినేని అఖిల్ (Akhil) గత ఏడాది జైనబ్ రవ్‌జీని సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ‘ఏజెంట్’ లాంటి భారీ పరాజయం తర్వాత దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకున్న అఖిల్.. పెళ్లి తర్వాత సరికొత్త లుక్‌తో ‘లెనిన్‘ (Lenin) ద్వారా రీ-ఎంట్రీ ఇచ్చారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించి, తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. వరుస వైఫల్యాలతో డీలా పడిన ఈ స్టార్ కి తన వివాహ బంధం అదృష్టాన్ని తీసుకురావడం, బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మొత్తానికి ‘ఒక ఇంటివారైతే.. లక్ ఆటోమేటిక్ గా కలిసివస్తుంది’ అనే పాత సామెతను మన టాలీవుడ్ స్టార్స్ ప్రస్తుత హిట్స్, కంబ్యాక్స్‌తో మరోసారి ప్రూవ్ చేస్తున్నారు. కెరీర్ పరంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పర్సనల్ లైఫ్‌లో తీసుకున్న ఈ కొత్త అడుగు వారి ప్రొఫెషనల్ లైఫ్ కు అద్భుతమైన బూస్ట్ ఇచ్చింది. ఈ మ్యారేజ్ సెంటిమెంట్ రాబోయే రోజుల్లో ఇంకెంతమందికి కలిసి వస్తుందో చూడాలి.