సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఈ ప్ర‌శ్న‌ల‌కు బదులేది?! అల్లు సినిమాస్‌పై ట్రోలింగ్స్‌!

ABN, Publish Date - Mar 15 , 2026 | 10:59 AM

అల్లు అర‌వింద్, అల్లు అర్జున్ ఏ ముహుర్తాన అల్లు సినిమాస్ మ‌ల్టీప్లెక్స్‌ను ప్రారంభించారో గానీ దాని ప్రాముఖ్య‌త క‌న్నా వివాదాల‌తో సోష‌ల్‌ మీడియాలో బాగా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

allu cinemas

అల్లు అర‌వింద్ (Allu Aravind), అల్లు అర్జున్ (Allu Arjun) ఏ ముహుర్తాన అల్లు సినిమాస్ (Allu Cinemas) మ‌ల్టీప్లెక్స్‌ను ప్రారంభించారో గానీ దాని ప్రాముఖ్య‌త క‌న్నా వివాదాల‌తో సోష‌ల్‌ మీడియాలో బాగా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అంతేగాక అల్లు అర్జున్ చుట్టూ కొత్త చర్చలకు దారి తీస్తోంది. మల్టీప్లెక్స్ లోపల ఏర్పాటు చేసిన అలంకరణలు, గోడలపై ఉన్న చిత్రాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సినీ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక‌టి రెండు చిత్రాల‌తో లైమ్ లైట్‌లోకి వ‌చ్చిన వారి ఫొటోలు పెట్టి ద‌శాబ్దాలుగా గొప్ప‌ సినిమాలు అనేకం తీసిన వారు మ‌చ్చుకైనా గుర్తు రాలేదా ? అంటూ తెగుడుతున్నారు.

ప్రధానంగా అక్కడి 'లెజెండరీ డైరెక్టర్స్ వాల్' పై రాజమౌళి, మణిరత్నం, రాజ్‌కుమార్ హిరానీ వంటి దిగ్గజాల సరసన దర్శకుడు అట్లీ పేరును చేర్చడం పట్ల నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన వారితో పోలిస్తే అట్లీకి ఆ స్థాయి గౌరవం దక్కడం తొందరపాటేనని కొందరు వాదిస్తుండగా, అల్లు అర్జున్‌తో ఆయన చేయబోయే భవిష్యత్తు సినిమా కోసమే ఈ ప్రాధాన్యత ఇచ్చారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

అంతేగాక తెలుగు నాట విశేష ఆద‌ర‌ణ ఉన్న కేవీ రెడ్డి, జంధ్యాల‌, 90ల‌లోనే ఆదిత్య 369 వంటి సైన్స్ ఫిక్షన్‌, పుష్ప‌క విమానం వంటి చిత్రాలు తీసి ఔరా అనిపించ‌డ‌మే గాక వందేళ్ల వ‌య‌సు స‌మీపిస్తున్న స‌మ‌యంలోనూ ఇప్పుడూ ఓ సినిమాను డైరెక్ట్‌ చేస్తున్న సింగీతం శ్రీనివాస రావు వంటి లెజెండ్స్‌ పేర్లు గుర్తుకు రాలేదా? అని ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా త‌న మార్క్ సినిమాల‌తో, టెక్నిక‌ల్‌, మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్‌తో ద‌క్షిణాదిన సంచ‌ల‌నం సృష్టించిన ఎన్. శంక‌ర్, భార‌తీయ సినిమాకే కొత్త ఒర‌వ‌డి నేర్పిన‌ రాం గోపాల్ వ‌ర్మ‌ వంటి గ్రేట్ డైరెక్ట‌ర్స్‌ మీకు ఎక్క‌డ త‌క్కువ‌య్యారు? అంటూ నిల‌దీస్తున్నారు.

మరోవైపు, భారతీయ సినిమాలోని ప్రముఖ నటుల కోసం కేటాయించిన గోడపై కేవలం పురుష నటుల పేర్లు మాత్రమే ఉండటం పెద్ద వివాదంగా మారింది. అమితాబ్ బచ్చన్, చిరంజీవి, రజనీకాంత్, షారుఖ్ ఖాన్, ప్రభాస్ వంటి స్టార్ల పేర్లు ఉన్నప్పటికీ, కనీసం ఒక్క మహిళా నటి పేరు కూడా లేకపోవడాన్ని నెటిజన్లు తప్పు బడుతున్నారు. భారతీయ సినిమా వైభవాన్ని చాటిచెప్పే క్రమంలో లింగ వివక్ష చూపడం సరికాదని విమర్శలు వస్తున్నాయి. రేఖ‌, శ్రీదేవి, మాధురీ దీక్షిత్, హేమా మాలిని, ఐశ్వ‌ర్య రాయ్‌ వంటి లెజెండరీ నటీమణులను అలాగే నేటి తరం నాయికలను విస్మరించడం సినిమా ఎదుగుదలలో వారి పాత్రను తక్కువ చేసినట్లేనని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.

కేవలం నటుల ఎంపికలోనే కాకుండా, అక్కడ రాసిన పేర్లలో ఉన్న అక్షర దోషాలు, స‌గం పేర్లు కూడా చర్చకు దారితీశాయి. 'ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ యాక్టర్స్' విభాగంలో అమీర్ ఖాన్ పేరును 'Amir' అని, అమితాబ్ బచ్చన్ పేరును 'Amithab' అని తప్పుగా రాశారు. ఒక ప్రతిష్టాత్మక మల్టీప్లెక్స్‌లో ఇంతటి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత పెద్ద స్థాయిలో థియేటర్ నిర్మించినప్పుడు, దేశం గర్వించే నటులు, టెక్నీషియ‌న్ల‌ పేర్ల విషయంలో కనీస అవగాహన ఉండాలని, అస‌లు వారి పేర్లు పెట్టకున్నా బావుండేద‌ని అంద‌రికీ సుప‌రిచిత‌మైన వారే అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు చురకలు వేస్తున్నారు.

నటుల ఎంపికపై కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. అద్భుతమైన నటనతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ వంటి వారిని పక్కన పెట్టి, కార్తీక్ ఆర్యన్ వంటి యువ నటుల పేర్లను చేర్చడం వెనుక ఉన్న తర్కాన్ని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అస‌లు మిమ్మ‌ల్ని ఫొటోలు పెట్టాల‌ని ఎవ‌రూ అడుగ‌లేదు క‌దా అలాంట‌ప్పుడు కొంద‌రివి మాత్ర‌మే పెట్టి మ‌రి కొంద‌రు ప్ర‌ముఖుల ఫొటోలు పెట్ట‌క‌పోడం వారిని, వారి అభిమానుల‌ను తీవ్రంగా అవ‌మానించిన‌ట్లే అని ఈ లోపాలను వెంటనే సరిదిద్దాలని కోరుకుంటున్నారు. భారతీయ సినీ వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఈ ప్రదర్శన గోడలను పునర్నిర్మించడం ద్వారా ఈ వివాదాలకు ముగింపు పలకవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

Updated Date - Mar 15 , 2026 | 01:46 PM