మొదటి భార్యకు.. విడాకులు ఇచ్చిన కన్నడ స్టార్
ABN, Publish Date - Sep 05 , 2026 | 07:29 AM
దక్షిణాది అగ్ర నటుడు దునియా విజయ్, నాగరత్న దంపతులకు కోర్టులో విడాకులు మంజూరయ్యాయి.
దక్షిణాది అగ్ర నటుడు దునియా విజయ్ (Duniya Vijay), నాగరత్న (Nagarathna) దంపతులకు కోర్టులో విడాకులు మంజూరయ్యాయి. విడాకులు కోరుతూ దునియా విజయ్ బెంగళూరు హైకోర్టులో దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణ పూర్తయ్యాక, పెండింగ్‌లో ఉన్న తీర్పును గురువారం ప్రకటించారు. న్యాయమూర్తులు జస్టిస్ హెచ్. శాంతిభూషణ్, జస్టిస్ డీకే సింగ్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విడాకులు మంజూరు చేసింది. నాగరత్నకు రూ.2 కోట్ల పరిహారం చెల్లించాలని దునియా విజయ్‌ని కోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు మూడు నెలలు గడువు ఇచ్చింది.
దునియా విజయ్ 1999లో నాగరత్నను పెళ్ళి చేసుకున్నారు. 2016లో కీర్తి (Keerthi Pattadi) ని రెండో పెళ్ళి చేసుకున్నారు. ఈ క్రమంలో మొదటి భార్యనుంచి విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. విచారణలు జరిపిన కోర్టు 2024లో పిటిషన్ ను కొట్టివేసింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు విడాకులు మంజూరు చేసింది.
విజయ్, నాగరత్న దంపతులకు కూతుళ్లు మోనిషా, మోనికా, కుమారుడు సామ్రాట్ ఉన్నారు. తీర్పు అనంతరం దునియా విజయ్ ఎక్స్‌లో స్పందించారు. అభిమానులు, జీవితాంతం వెంట ఉండే మీడియా మిత్రులకు మనవి. కోర్టు ఆదేశాలను శిరసావహిస్తాను అన్నారు. నా కూతుళ్లు యుక్త వయసులో ఉన్నారు. నా పిల్లల భవిష్యత్తు, నా వైవాహిక జీవితంపై కోర్టు ఆదేశాలను ఆత్మసాక్షిగా స్వీకరిస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు.
ఇదిలాఉంటే.. దునియా విజయ్ ఇప్పటికే బాకృష్ణ వీర సింహా రెడ్డి సినిమాలో ప్రతినాయకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాగా త్వరలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న స్లమ్ డాగ్ సినిమాలోనూ కనిపించనున్నాడు.