కమల్ ఒక్కడికే 150 కోట్లు ఇస్తే.. మరి ప్రభాస్, అమితాబ్?
ABN, Publish Date - Mar 11 , 2026 | 07:22 AM
భారత సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకునే హీరో అనగానే సాధారణంగా రజనీకాంత్, షారుక్ ఖాన్, విజయ్ దళపతి వంటి పేర్లు గుర్తుకు వస్తుంటాయి.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషికం అందుకునే హీరో అనగానే సాధారణంగా రజనీకాంత్, షారుఖ్ ఖాన్, విజయ్ దళపతి వంటి పేర్లు గుర్తుకు వస్తుంటాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ రేసులో అందరినీ వెనక్కి నెట్టి 'లోక నాయకుడు' కమల్ హాసన్ (Kamal Haasan) అగ్రస్థానంలో నిలిచారు. ప్రముఖ తమిళ నటుడు, రచయిత యుగి సేతు వెల్లడించిన వివరాల ప్రకారం, గ్లోబల్ హిట్ ‘కల్కి 2898 ఎ.డి.’ (Kalki 2) కోసం కమల్ అందుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వయసులోనూ ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘కల్కి 2898 ఎ.డి.’ సినిమాలో నటించేందుకు కమల్ హాసన్ కేవలం పది రోజుల కాల్‌షీట్స్ మాత్రమే కేటాయించారు. ఇందుకు నిర్మాత అశ్వినీదత్ ఏకంగా రూ. 150 కోట్ల భారీ పారితోషికాన్ని అందించినట్లు సమాచారం. ఈ లెక్కన చూస్తే, కమల్ రోజుకు సుమారు రూ. 15 కోట్లు వసూలు చేసినట్లు అర్థమవుతోంది. ఒక సీనియర్ నటుడికి ఈ స్థాయిలో రెమ్యునరేషన్ దక్కడం భారతీయ సినీ చరిత్రలోనే సరికొత్త రికార్డుగా సినీ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.
ప్రస్తుతం కమల్ హాసన్ ‘కల్కి 2’ షూటింగ్‌లో ఎంతో బిజీగా గడుపుతున్నారు. అమితాబ్ బచ్చన్ (Amitab bachan) తో కలిసి కీలక సన్నివేశాల్లో పాల్గొంటున్న ఆయనకు, రెండో భాగం కోసం కూడా భారీ మొత్తమే అందుతోందని టాక్ వినిపిస్తోంది. కేవలం నటుడిగానే కాకుండా, నిర్మాతగా కూడా ఆయన అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఆయన నిర్మాణంలో వచ్చిన ‘అమరన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించడమే ఇందుకు నిదర్శనం. 70 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తూ అటు నటనలో, ఇటు సంపాదనలో తన ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారు.
మరోవైపు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ త్వరలోనే ఈ షూటింగ్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ వంటి భారీ చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ, ‘కల్కి 2’ కోసం సమయం కేటాయించనున్నారు. మొదటి భాగం క్లైమాక్స్‌లో 'ఆలస్యమైందా ఆచార్య దేవా...' అంటూ కర్ణుడి అవతారంలో ప్రభాస్ చూపిన నటన ప్రేక్షకుల్లో భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సీక్వెల్ కోసం సినీ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.