సెప్టెంబర్ 25న.. ‘కళ్యాణం కమనీయం జీవితం’
ABN, Publish Date - Sep 18 , 2026 | 12:45 PM
ఖాన్ దురాని, సాహితి ఆవంచ ప్రధాన పాత్రల్లో నటించిన ‘కళ్యాణం కమనీయం జీవితం’ సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా విడుదల కానుంది.
వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఖాన్ దురాని, సాహితి ఆవంచ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘కళ్యాణం కమనీయం జీవితం’ ఈ నెల 25న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైంది. రవి లోకిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో రాజవంశీ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. రిలీజ్ సందర్భంగా చిత్ర బృందం మీడియాతో సమావేశమై సినిమా విశేషాలను పంచుకుంది.
నిర్మాత పైలా ప్రసాద్ రావు మాట్లాడుతూ, ఇటీవల సినిమా కొంతమంది స్నేహితులు, శ్రేయోభిలాషులు, మీడియా ప్రతినిధులకు ప్రదర్శించామని, వారి నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని తెలిపారు. లెజెండరీ రచయిత విజయేంద్ర ప్రసాద్ పోస్టర్‌ను, చంద్రబోస్ పాటను విడుదల చేయడం తమకు పెద్ద ప్రోత్సాహమని చెప్పారు. వి.వి. వినాయక్ ఆశీస్సులు కూడా లభించాయని గుర్తుచేశారు. చిన్న సినిమా అయినా కంటెంట్ పరంగా పెద్ద స్థాయిలో ఉంటుందని, కుటుంబ ప్రేక్షకులు, యువతను ఆకట్టుకునేలా దర్శకుడు సినిమాను తీర్చిదిద్దారని అన్నారు.
దర్శకుడు రవి లోకిరెడ్డి మాట్లాడుతూ, టైటిల్ వినగానే నిర్మాతలు ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు. ఇప్పటికే పాటలు, ట్రైలర్‌కు మంచి స్పందన లభించిందని తెలిపారు. మంచి కథ, భావోద్వేగాలు, అనూహ్య మలుపులతో సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పారు. కొత్త నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని, ప్రముఖ నటన గురువు సత్యానంద్ కూడా సినిమాలో కీలక పాత్ర పోషించారని వెల్లడించారు. సినిమా చూసిన ప్రేక్షకులు నిరాశ చెందరని ధీమా వ్యక్తం చేశారు.
చిత్రంలో కీలక పాత్ర పోషించిన విషిక మాట్లాడుతూ, దర్శకుడు రవి ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో దగ్గర నుంచి చూశానన్నారు. తన పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే చేసిన ‘కమిటీ కుర్రాళ్లు’, ‘కోర్టు’ చిత్రాలకు లభించిన ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. ‘కళ్యాణం కమనీయం జీవితం’ కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
హీరో ఖాన్ దురాని మాట్లాడుతూ, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం ఆనందంగా ఉందన్నారు. మొదట సెప్టెంబర్ 18న విడుదల చేయాలని భావించినా, ఇప్పుడు సెప్టెంబర్ 25కు వాయిదా వేసినట్లు తెలిపారు. అదే రోజు విడుదల కానున్న నాని చిత్రం ‘పారడైజ్’తో పోటీ అనే భావన లేదని స్పష్టం చేశారు. నాని తనకు ఎంతో ఇష్టమైన నటుడు, ప్రేరణ అని పేర్కొన్నారు. ‘కళ్యాణం కమనీయం జీవితం’ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని, ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి తమ ప్రయత్నాన్ని ఆదరించాలని కోరారు.
హీరోయిన్ సాహితి ఆవంచ మాట్లాడుతూ, ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. తనపై నమ్మకం ఉంచిన నిర్మాతలు, దర్శకుడికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రేమతో రూపొందించిన ఈ సినిమాను ప్రేక్షకులు కూడా అదే ప్రేమతో ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 25న సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.