Kajal : నీల్‌ చూసే మొదటి సినిమా అదే అవుతుంది..

ABN , Publish Date - Jul 07 , 2026 | 07:22 PM

పెళ్లి, తదుపరి తల్లి కావడంతో వ్యక్తి జీవితంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. కొంత బ్రేక్‌ తర్వాత ఆమె మళ్లీ సినిమాలవైపు ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు.

పెళ్లి, తదుపరి తల్లి కావడంతో వ్యక్తి జీవితంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు కాజల్. కొంత బ్రేక్‌ తర్వాత ఆమె మళ్లీ సినిమాలతో బిజీ కానున్నారు. ప్రస్తుతం సినిమాల విషయంలో సెలెక్టివ్‌గా వెళ్లాలనుకుంటున్నారు. తెలుగులో బాలయ్యతో ఓ సినిమా చేస్తున్నారు. తాజాగా ఆమె నటించిన ‘ద ఇండియన్‌ స్టోరీ’ విడుదలకు సిద్థమైంది. అంతే కాదు భారతదేశం గర్వించే స్థాయిలో రణ్‌బీర్‌ కపూర్‌, సాయి పల్లవి సీతారాములుగా నటిస్తున్న ‘రామాయణ్‌’ చిత్రంతో ఆమె మండోదరి పాత్ర పోషస్తున్నారు. ఈ విషయాన్ని కాజల్‌ అఫీషియల్‌గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నితీష్‌ తివారీ దర్శకత్వంలో నమిత్‌ మల్హోత్ర రూ. 4000 కోట్ల బడ్జెట్‌తో రెండు పార్టులుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజా ఇంటర్వ్యూలో కాజల్‌ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తను చేసే చిత్రాల గురించి, తనలో వచ్చిన మార్పు గురించి తెలిపారు. ‘ఇప్పుడు నేను ఏ సినిమా చేసినా నా కొడుకుని దృష్టిలో పెట్టుకుని అంగీకరిస్తా. ‘అమ్మ చేసిన గొప్ప సినిమా ఇది’ అని అతడు గర్వంగా చెప్పుకోవాలి. అందుకే ఎలాంటి చిత్రాలు చేయాలి? అనే విషయంపై నాకు ఎక్కువ బాధ్యత, అవగాహన పెరిగాయి. నా బిడ్డ నీల్‌కి రామాయణం అంటే ఇష్టం. ఇంట్లో రోజూ రామ్‌ లీలా చూస్తాడు. నేను ‘రామాయణ’లో మండోదరిగా నటిస్తున్నానని చెప్పగానే ఎంతో ఆనందపడ్డాడు. అతడికి ఇష్టమైన పాత్ర రావణుడు. ఈ మూవీ పార్ట్‌ 2 వచ్చేసరికి నీల్‌కి ఐదేళ్లు వస్తాయి. థియేటర్‌లో నా కొడుకు చూేస మొదటి సినిమా ఇదే అవుతుంది’ అని కాజల్‌ అన్నారు.

Updated Date - Jul 07 , 2026 | 07:41 PM