బాలకృష్ణకు జోడీగా.. చందమామ!
ABN, Publish Date - Apr 21 , 2026 | 08:15 PM
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు మొదలవుతాయి.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Balakrishna), మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand malineni) కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు మొదలవుతాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీరసింహా రెడ్డి’ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, బాలయ్య కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబో సెట్స్ పైకి వెళ్లడం నందమూరి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. NBK111 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం పక్కా యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమై, ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో కథానాయికల ఎంపిక విషయంలో చిత్ర యూనిట్ భారీ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanatara) ఈ ప్రాజెక్టులో ప్రధాన హీరోయిన్‌గా నటిస్తుండగా, తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కూడా ఈ భారీ చిత్రంలో భాగం కానుందట. గతంలో బాలయ్యతో కలిసి ‘భగవంత్ కేసరి’లో తన నటనతో మెప్పించిన కాజల్, ఇప్పుడు మళ్లీ ఆయన సరసన కనిపించనుండటం విశేషం. నయనతార - కాజల్ వంటి అగ్ర హీరోయిన్లు ఒకే సినిమాలో నటిస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. వీరిద్దరి పాత్రలు కథలో చాలా కీలకమని తెలుస్తోంది. వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
బాలకృష్ణ ‘అఖండ-2’ వంటి భారీ సీక్వెల్ తర్వాత చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే కావడం గమనార్హం. గోపీచంద్ మలినేని మార్క్ మాస్ ఎలిమెంట్స్, బాలయ్య పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ ఈ సినిమాలో హైలైట్‌గా నిలవనున్నాయి. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, బలమైన ఎమోషన్స్ కూడా ఈ కథలో ఉంటాయని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా గోపీచంద్ ఒక పక్కా కమర్షియల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారట. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో కూడా భారీ వ్యాపార అంచనాలు ఉన్నాయి.
‘వీరసింహా రెడ్డి’ సినిమాతో వీరిద్దరి మధ్య ఉన్న సింక్ ఇప్పటికే రుజువైంది. ఆ అంచనాలను అందుకునేలా దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నయనతార, కాజల్ వంటి గ్లామర్ జోడి తోడవడంతో సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో కూడా గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. షూటింగ్ పూర్తి చేసుకుని ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నద్ధమవుతున్నారు.