సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

జూలైలో అనువాద చిత్రాల హవా...

ABN, Publish Date - Aug 01 , 2026 | 02:58 PM

జూలై నెలలో తొమ్మిది డబ్బింగ్‌తో కలిపి మొత్తం 29 సినిమాలు జనం ముందుకు వచ్చాయి. అయితే ఈ నెలాఖరులో వచ్చిన 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్‌ న్యూ డే' విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం విశేషం.

July Movies

జూలై మొదటి వారాంతంలో మొత్తం నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. భారీ అంచనాలతో వచ్చిన 'నాగబంధం' సినిమా నిరాశపర్చగా, వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన 'రావు బహదూర్' సాధారణ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఆర్.కె. దీక్ష, అనువాద చిత్రం 'మిలియన్స్ అండ్‌ మాన్ స్టర్స్ కూడా బాక్సాఫీస్‌ దగ్గర పెద్దంత ప్రభావం చూపలేదు. ఇక ఎంతోకాలంగా అక్కినేని అభిమానులు ఎదురుచూసిన 'లెనిన్' సినిమా జూలై 10న జనం ముందుకు వచ్చింది. మూడేళ్ళ తర్వాత వచ్చిన ఈ అఖిల్ సినిమా తొలుత డివైడ్ టాక్ ను తెచ్చుకున్నా... క్రమంగా కలెక్షన్స్ పుంజుకున్నాయి. చిత్రంగా ఈ సినిమా విడుదలైన మూడు వారాలకు వంద కోట్ల క్లబ్ లో చేరింది. గత యేడాది వచ్చిన నాగ చైతన్య 'తండేల్‌' కూడా తొలిసారి వంద కోట్ల గ్రాస్ ను అందుకోగా, ఇప్పుడా మైల్ స్టోన్ ను అఖిల్ దాటాడు. ఈ సెకండ్ వీకెండ్‌లో 'లెనిన్'తో పాటు 'వసుదేవసుతం' వచ్చింది కానీ దానిని ఎవరూ పట్టించుకోలేదు. అలానే 'లవ్‌ ఓ లవ్‌, ఐ, నో బడీ, హృదయం మురళీ, ఈవిల్‌ డెడ్ బర్న్' అనే నాలుగు అనువాద చిత్రాలూ వచ్చాయి. ఇవేవీ పెద్దంత మెప్పించలేదు.


థర్డ్ వీకెండ్‌లో ఏకంగా పది సినిమాలు విడుదల కావడం విశేషం. ఇందులో రెండు అనువాద చిత్రాలు ఉన్నాయి. ఈ వారం వచ్చిన 'ఓ సుకుమారి, వదలా, మిస్టర్ మిడిల్‌ క్లాస్‌, ఒక కోర్టు కేసు, ఎంఆర్పీ, ఆపరేషన్‌ అరుణారెడ్డి, వెంకట్రామయ్య గారి తాలూకా, రాజా ది రాజా' చిత్రాలు ఉన్నాయి. సీనియర్ హీరోలు జగపతిబాబు, శ్రీకాంత్‌ సైతం జనాలను మెప్పించడంలో విఫలమయ్యారు. ఈ వారం వచ్చిన అనువాద చిత్రాల్లో 'ది ఒడిస్సీ'కి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే నిడివి ఎక్కువ ఉండటం ఈ సినిమాకు ప్రధాన సమస్యగా మారింది.

నాలుగో వారాంతంలో వచ్చిన చిత్రాలలో 'చెన్నై లవ్ స్టోరీ'కీ డివైడ్ టాక్ వచ్చింది. ప్రథమార్థం అద్భుతంగా ఉందని పొగిడిన వారే ద్వితీయార్థం చూసి పెదవి విరిచేశారు. అయితే చిత్రంగా ఈ సినిమా కూడా నిదానంగా పాజిటివ్‌ టాక్ తెచ్చుకుని యాభై కోట్ల గ్రాస్ ను అందుకుంది. దీనితో వచ్చిన 'చంద్రప్పన్, హే చికితా' చిత్రాలు అడ్రస్‌ లేకుండా పోయాయి. ఇక ఎంతోకాలంగా విజయ్ అభిమానులు ఎదురు చూస్తూ వచ్చిన 'జన నాయకుడు' తమిళనాట భారీ కలెక్షన్స్ ను పొందింది కానీ తెలుగులో డీలా పడింది.


ఇక ఈ నెల చివరి వారంలో ఓ అనువాద చిత్రంతో కలిపి ఐదు సినిమాలు వచ్చాయి. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేశ్‌ బాబు తనయుడు జైకృష్ణ నటించిన 'శ్రీనివాస మంగాపురం' విడుదలకు ముందు మంచి బజ్ క్రియేట్‌ అయ్యింది. ఈ సినిమాతోనే రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ సైతం టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అజయ్ భూపతి దర్శకత్వంలో అశ్వనీదత్‌ సమర్పణలో పి. కిరణ్‌ నిర్మించిన ఈ సినిమా ఘట్టమనేని అభిమానులను సైతం మెప్పించలేకపోయింది. అభినయ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'కర్మాఖ్య', సుశాంత్‌ 'న్యూటన్స్ థర్డ్ లా', అదే నీవు అదే నేను' చిత్రాలు ఆడియెన్స్ ను ఆకట్టుకోలేదు. ఈ నెల 30న వచ్చిన 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్‌ న్యూ డే'కు సూపర్ రెస్పాన్స్ రావడంతో చాలా థియేటర్లలో తెలుగు సినిమాలను తీసేసి, 'స్పైడర్ మ్యాన్'మూవీనే ఎగ్జిబిటర్స్ ప్రదర్శించారు. మొత్తం మీద ఈ నెలలో వచ్చిన సినిమాల్లో 'లెనిన్, చెన్నై లవ్ స్టోరీ'తో పాటు అనువాద చిత్రాలు 'స్పైడర్ మ్యాన్‌', 'ఓడిస్సీ' ప్రేక్షకులను మెప్పించి అగ్రస్థానంలో నిలిచాయి.

ఇవి కూడా చదవండి:

అంజలీదేవి నుంచి సాయి పల్లవి వరకు.. వెండితెర సీతమ్మల జర్నీ!

బర్త్‌డే స్పెషల్.. ‘టాక్సిక్’ రాయల్ లుక్‌లో కియారా!

సీనియర్ నటి మంజు భార్గవితో NSR స్పెషల్ ఇంటర్వ్యూ

Updated Date - Aug 01 , 2026 | 03:03 PM