ఒకవైపు త్రివిక్రమ్.. మరోవైపు అనిల్ రావిపూడి.. ఎన్టీఆర్ ప్లాన్ మామూలుగా లేదుగా!
ABN, Publish Date - Nov 18 , 2026 | 01:43 PM
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ పూర్తి చేసిన తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్‌తో గాడ్ ఆఫ్ వార్, అనిల్ రావిపూడితో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నారు. మరి ఈ రెండు సినిమాలను తారక్ ఒకేసారి సెట్స్‌పైకి తీసుకెళ్తారా? ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr Ntr ) లైనప్ చూస్తుంటే ఇటు నందమూరి అభిమానులతో పాటు యావత్ సినీ ప్రేక్షకులు కాలర్ ఎగరేస్తున్నారు. 2015లో వచ్చిన టెంపర్ చిత్రం నుంచి ఇప్పుడు రాబోతున్న డ్రాగన్ (Dragon) సినిమా వరకు ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేసే మూడ్‌లో అస్సలు లేరు. మద్యలో వచ్చిన వార్-2 కాస్త మిశ్రమ ఫలితం వచ్చినా అది బాలీవుడ్ సినిమా కావడంతో మనోళ్లు చాలా లైట్ తీసుకున్నారు. ఇక ప్రస్తుతం తారక్ నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ డ్రాగన్.
ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే విపరీతమైన బజ్ సొంతం చేసుకున్న ఈ సినిమా షూటింగ్ చకచకా సాగుతోంది. అయితే డ్రాగన్ సెట్స్ పై ఉండగానే, తారక్ తన తర్వాతి ప్రాజెక్టులను కూడా పక్కా ప్లానింగ్ తో లైన్ లో పెట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ ను ఎగ్జైట్ చేస్తున్న క్రేజీ అప్డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
డ్రాగన్ తర్వాత ఎన్టీఆర్ వెంటనే మొదలుపెట్టబోయే ప్రాజెక్ట్ గాడ్ ఆఫ్ వార్ (God of War). మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో రానున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అరవింద సమేత లాంటి పవర్ ఫుల్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబో రిపీట్ అవుతుండటంతో ప్రాజెక్ట్ పై హైప్ తారాస్థాయికి చేరింది. అయితే ఈ చిత్రం ఆగిపోయినట్లు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో గాడ్ ఆఫ్ వార్ పెట్టిన ఒక్క పోస్ట్‌తో వాటన్నింటికి చెక్ పెట్టినట్లయింది. ఈ భారీ చిత్రాన్ని వచ్చే జూలై నుంచి సెట్స్ పైకి తీసుకెళ్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా క్లారిటీ ఇచ్చేశారు.
త్రివిక్రమ్ మార్క్ ఎమోషన్స్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో భారీ స్కేల్ లో తెరకెక్కించేందుకు గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. పౌరాణిక, మైథలాజికల్ లేదా చారిత్రక అంశాల నేపథ్యంతో ఈ ప్రాజెక్ట్ ఉండబోతోందనే టాక్ బలంగా వినిపిస్తోంది. గాడ్ ఆఫ్ వార్ సినిమా ఒకవైపు ఉంటే, రీసెంట్ గా అనౌన్స్ అయిన మరో క్రేజీ సర్ప్రైజ్ ప్రాజెక్ట్ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అదే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) తో తారక్ చేయబోయే సినిమా.
అసలు వీరిద్దరి కాంబినేషన్ అనౌన్స్ కావడమే ఒక పెద్ద సర్ప్రైజ్ అయితే, ఈ సినిమాని 2028 సంక్రాంతి బరిలో దించడం మరో సర్ప్రైజ్..అనిల్ రావిపూడి వర్కింగ్ స్టైల్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. పక్కా ప్రీ ప్రొడక్షన్, క్రమశిక్షణతో కూడిన ప్లానింగ్ తో చాలా తక్కువ సమయంలోనే సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడంలో ఆయన దిట్ట. పైగా సంక్రాంతి బరిలో దిగి బ్లాక్ బస్టర్ కొట్టడం ఆయనకు అలవాటైన విద్య. దీంతో తారక్ తో చేయబోయే ప్రాజెక్ట్ ను కూడా శరవేగంగా ఫినిష్ చేసి పండగ సీజన్ కే థియేటర్లలోకి తీసుకురావాలని చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఇక్కడే అసలైన సస్పెన్స్ మొదలైంది. గాడ్ ఆఫ్ వార్ లాంటి భారీ ప్రాజెక్ట్ కు కచ్చితంగా ఎక్కువ సమయం, భారీ కాల్షీట్లు అవసరం. విజువల్స్, భారీ సెట్స్ కోసం త్రివిక్రమ్ ఎక్కువ టైమ్ కేటాయించాల్సి ఉంటుంది. ఆ గ్యాప్ లో తారక్ ఖాళీగా ఉండకుండా, అనిల్ రావిపూడితో అనుకున్న సినిమాను శరవేగంగా ఫినిష్ చేస్తారా..? లేక రెండు సినిమాలనూ ప్యారలల్ గా బ్యాలెన్స్ చేస్తూ నడిపిస్తారా అనేది పెద్ద సస్పెన్స్‌గా మారింది. ఒకవేళ తారక్ గనుక రెండు ప్రాజెక్టులను ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్తే బాక్సాఫీస్ దగ్గర పండగే అని చెప్పాలి. ఒకవైపు క్లాస్, మాస్ ఎలివేషన్స్ తో కూడిన భారీ ప్యాన్ ఇండియా మూవీ, ఇంకోవైపు అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్.
ఇలా ఒకే ఏడాదిలో రెండు విభిన్నమైన జోనర్లను ఫ్యాన్స్ కు అందించే అవకాశం ఉంటుంది. భారీ సినిమా మధ్యలో ఇలాంటి ఒక క్విక్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఫ్యాన్స్ కు కూడా అదిరిపోయే ట్రీట్ దక్కుతుంది. ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ ఫోకస్ మొత్తం డ్రాగన్ మీదే ఉంది. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమాతో పాటు అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ ను ఎలా ప్లాన్ చేసుకుంటారనే దానిపై త్వరలోనే పూర్తి అధికారిక వివరాలు రానున్నాయి. మరి తారక్ రెండు సినిమాలను సైమల్టేనియస్ గా పూర్తి చేస్తారా లేక ఒకదాని తర్వాత ఒకటి థియేటర్లలోకి తెస్తారా అనేది వేచి చూడాలి.