జూనియర్ ఎన్టీఆర్‌కు శస్త్రచికిత్స.. ఆరోగ్యంపై కీలక ప్రకటన
ABN, Publish Date - Aug 11 , 2026 | 07:22 PM
ఎన్టీఆర్ ఆరోగ్యంపై ఆయన కార్యాలయం అధికారికంగా తాజా ప్రకటన విడుదల చేసింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( Jr NTR) కి ఇటీవల గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఆయనకు హైదరాబాద్‌లోని 'కిమ్స్' ఆస్పత్రిలో వైద్యులు శస్త్రచికిత్స చేయనున్నారు. భుజానికి అయిన గాయానికి డాక్టర్ల సలహా మేరకు ఈ సర్జరీ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీఆర్ కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. వైద్యుల బృందం ఆయన త్వరగా, పూర్తి ఆరోగ్యంతో కోలుకునేలా చికిత్స అందిస్తోంది. తారక్ హెల్త్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కి అందిస్తామని టీమ్ స్పష్టం చేసింది. దంతో అభిమానులంతా తారక్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఎన్టీఆర్, సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'డ్రాగన్'. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఎన్టీఆర్‌కు గాయమైందనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ, దీనిపై మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అయితే, హీరోకి గాయమై సర్జరీ దాకా వెళ్లినా.. 'డ్రాగన్' షూటింగ్ మాత్రం ఎక్కడా ఆగిపోలేదట. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏమాత్రం సమయం వృథా చేయకుండా పక్కా ప్లానింగ్‌తో లొకేషన్‌లో దూసుకుపోతున్నారట. తారక్ లేని కీలక సన్నివేశాలను శరవేగంగా చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ పూర్తిగా కోలుకున్న తర్వాత డ్రాగన్ సెట్‌లో అడుగుపెడతారని సమాచారం.
ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో తారక్ సరసన కన్నడ బ్యూటీ 'రుక్మిణి వసంత్' కథానాయికగా అలరించబోతోంది. ఇక ఈ ప్రాజెక్ట్ లో 'అనిల్ కపూర్', 'అశుతోష్ రాణా' ఈ సినిమాలో అతి ముఖ్యమైన, పవర్‌ఫుల్ పాత్రల్లో కనిపించబోతున్నారు.ఇక ప్రశాంత్ నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు రవి బస్రూర్ అందిస్తున్న మాస్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి తుఫాన్ సృష్టిస్తుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడకతప్పదు.