NTR: స్టార్ హీరోల కొత్త బిజినెస్.. ఇప్పుడు ఎన్టీఆర్ వంతా?
ABN, Publish Date - Jul 31 , 2026 | 01:45 PM
టాలీవుడ్ స్టార్ హీరోలు కేవలం సినిమాల్లో నటించడం మాత్రమే కాదు.. సినిమా వ్యాపారంలో కి కూడా భాగస్వాములవుతున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోలు కేవలం సినిమాల్లో నటించడం మాత్రమే కాదు.. సినిమా వ్యాపారంలో కి కూడా భాగస్వాములవుతున్నారు. నిర్మాణం, పంపిణీ కాకుండా థియేటర్ బిజినెస్‌పైనా దృష్టి పెడుతున్నారు. సొంత బ్రాండ్‌తో అత్యాధునిక మల్టీప్లెక్స్‌లను నిర్మిస్తూ ఎగ్జిబిషన్ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఈ ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన వారిలో మహేశ్ బాబు (MAhesh) ముందుంటారు. హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్ దేశంలోనే అత్యుత్తమ మల్టీప్లెక్స్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. అత్యాధునిక టెక్నాలజీ, లగ్జరీ సౌకర్యాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా ఏఏఏ సినిమాస్ ద్వారా థియేటర్ రంగంలోకి ప్రవేశించారు. ఇటీవల మాస్ మహారాజా రవితేజ, విజయ్ దేవరకొండ కూడా ఈ రంగంలో పెట్టుబడులు పెట్టి తన వ్యాపార విస్తరణను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఇదే జాబితాలోకి మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr Ntr) కూడా చేరబోతున్నారనే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో అత్యాధునిక ప్రీమియం మల్టీప్లెక్స్ నిర్మించేందుకు తారక్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేకపోయినా, సినీ వర్గాల్లో మాత్రం ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది.
గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్‌గూడ ప్రస్తుతం హైదరాబాద్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు. వేలాది ఐటీ ఉద్యోగులు, కార్పొరేట్ సంస్థలు, భారీ స్థాయిలో నివాస సముదాయాలు ఉండటంతో ఈ ప్రాంతంలో ప్రీమియం మల్టీప్లెక్స్‌కు మంచి డిమాండ్ నిపుణులు భావిస్తున్నారు. అందుకే తారక్ కూడా ఈ లొకేషన్‌ను ఎంచుకున్నారనే ప్రచారం వినిపిస్తోంది. ఈ వార్త నిజమైతే.. మహేశ్ బాబు, అల్లు అర్జున్, రవితేజ తర్వాత థియేటర్ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన మరో స్టార్ హీరోగా జూనియర్ ఎన్టీఆర్ నిలుస్తారు. ప్రస్తుతం తారక్ డ్రాగన్ సినిమాతో బిజీ గా ఉన్నారు. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకుడు.