సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

NTR: ‘చుట్టమల్లె’ AI మార్ఫింగ్‌పై ఎన్టీఆర్‌ ఫైర్‌..

ABN, Publish Date - Oct 03 , 2026 | 02:01 PM

‘దేవర’ చిత్రంలోని ‘చుట్టమల్లె సాంగ్‌’ పేరుతో వైరల్‌ అవుతున్న ఓ మార్ఫింగ్‌ వీడియోపై ఎన్టీఆర్‌ ఫైర్‌ అయ్యారు.

‘దేవర’ (Devara) చిత్రంలోని ‘చుట్టమల్లె సాంగ్‌’ (Chuttamalle song) పేరుతో వైరల్‌ అవుతున్న ఓ మార్ఫింగ్‌ వీడియోపై ఎన్టీఆర్‌ ఫైర్‌ అయ్యారు. ఒరిజినల్‌ సాంగ్‌ పద్దతిగానే ఉన్నా... ఏఐలో దానిని జుగుప్సాకారంగా క్రియేట్‌ చేశారని మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఆయన స్పందించారు. ఇలాంటి కంటెంట్‌ను క్రియేట్‌ చేస్తున్న వారితోపాటు దాన్ని సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తారక్‌ హెచ్చరించారు. ‘అసహ్యం.. (Disgusting, Sick and Shameless) . జుగుప్సాకరం.. సిగ్గుచేటు’’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
 

"మహిళలను తల్లులుగా, దేవతలుగా గౌరవించే భారతీయ సంస్కృతిలో ‘మాతృదేవోభవ’ అనే నినాదానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అలాంటి సమాజంలో ఒక మహిళను అత్యంత అవమానకరంగా చూపించేందుకు AIని ఉపయోగించడం ఎంత దారుణమో మాటల్లో చెప్పలేను. ఇలాంటి నీచమైన కంటెంట్‌ను సృష్టించేందుకు AIని దుర్వినియోగం చేయడం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ మార్ఫింగ్ వీడియో వెనుక ఉన్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. ఈ వీడియోను రూపొందించిన వారితో పాటు, దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపైనా చట్టపరంగా సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటాను. దీనిపై అవసరమైన ప్రతి చట్టపరమైన మార్గంలో వెళ్తాను. ఇలాంటి వీడియోలను ఎవరూ చూడకండి, షేర్ చేయకండి  వాటితో ఎలాంటి విధంగానూ ఎంగేజ్ అవ్వకండి. మీరు ఒకసారి షేర్ చేసినా, ఎంగేజ్ చేసినా ఇలాంటి కంటెంట్ మరింతగా వ్యాప్తి చెందుతుంది. ఈరోజు బాధితురాలు మరొకరు కావచ్చు.. రేపు మీ తల్లి, సోదరి, భార్య లేదా కుమార్తె కూడా కావచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరుతున్నాను. AI సాంకేతికత ఎంతో ఉపయోగకరమైనదే. కానీ దాన్ని ఒకరి గౌరవాన్ని, వ్యక్తిగత స్వేచ్ఛను, ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఉపయోగించడం మాత్రం ఏమాత్రం అంగీకరించలేం. డీప్‌ఫేక్‌లు, మార్ఫింగ్ వీడియోల ద్వారా వ్యక్తులను అవమానించే ఘటనలను అరికట్టాల్సిన అవసరం ఇప్పుడు మరింత పెరిగింది. AI దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు భారత ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరుతున్నాను. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన నిబంధనలు తీసుకురావడంతో పాటు, వాటిని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది కేవలం నా ఒక్కరి సమస్య కాదు. రేపు ఇలాంటి పరిస్థితి ఎవరికి అయినా ఎదురుకావచ్చు. మహిళల గౌరవం, వ్యక్తిగత భద్రతను కాపాడటం మనందరి బాధ్యత" అని తారక్ పేర్కొన్నారు.

Updated Date - Oct 03 , 2026 | 02:33 PM