యాక్టర్‌గా ఆయన కాలి గోటికి కూడా సరిపోను- జేడీ చక్రవర్తి
ABN, Publish Date - Apr 06 , 2026 | 08:17 PM
యాక్టర్‌గా ఆ హీరో కాలి గోటికి కూడా పనికి రాను కానీ, ఆయన ఇప్పటి వరకు చేయనటువంటి గొప్ప పాత్రని చేశానని అన్నారు విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి
యాక్టర్‌గా ఆ హీరో కాలి గోటికి కూడా పనికి రాను కానీ, ఆయన ఇప్పటి వరకు చేయనటువంటి గొప్ప పాత్రని చేశానని అన్నారు విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి. ఇంతకీ ఇక్కడాయన చెబుతున్న వ్యక్తి ఎవరో తెలుసా? యూనివర్సల్ హీరో కమల్ హాసన్. నూతన దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో సప్తస్వ మీడియా వర్క్స్, పీఓవీ స్టోరీస్, జీ స్టూడియోస్ పతాకాలపై రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘గాయపడ్డ సింహం’ (Gaayapadda Simham). తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పవన్ సాదినేని సమర్పణలో కళ్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జేడీ చక్రవర్తి (JD Chakravarthy) ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఆ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసేందుకు సోమవారం హైదరాబాద్‌లో మీడిమా సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జేడి చక్రవర్తి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘యాక్టర్స్ అందరికీ కమల్ హాసన్ (Kamal Haasan) ఒక కొలమానం. ఆయన చేసినన్ని పాత్రలు వరల్డ్ సినిమా హిస్టరీలో ఎవ్వరూ చేయలేదు, ఇకపై చేయబోరు కూడా. కానీ, ‘గాయపడ్డ సింహం’ సినిమాలో యాక్టర్‌గా కాదు, క్యారెక్టర్ పరంగా ఆయనకు రాని అదృష్టం నాకు వచ్చిందని చెప్పగలను. యాక్టర్‌గా నేను కమల్ హాసన్ కాలి గోటికి కూడా పనికి రాను. కానీ, ఇందులో చేసిన పాత్ర మాత్రం ఆయన కూడా ఇప్పటి వరకు చేయనటువంటి పాత్ర. ఇందులో నేను చేసిన ‘ధర్మ’ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. అందుకే చెప్పింది, పాత్ర పరంగా కమల్ హాసన్ కూడా ఇలాంటి పాత్ర చేసి ఉండరు. అంత గొప్ప పాత్ర ఇందులో నాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది.
కెరీర్‌లో చాలామందికి జయాపజయాలు ఉంటాయి. కానీ, ప్రతి ఒక్కరికీ కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్ర ఒకటి ఉంటుంది. నాకు ‘మనీ, సత్య, అనగనగా ఒక రోజు’ వంటి చిత్రాలు ట్రెండ్ సెట్టర్స్‌గా నిలిచాయి. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అలాంటి పాత్ర చేసే అవకాశం లభించింది. ఈ సినిమాను పవన్ తన భుజాన వేసుకుని మొదలు పెడితే.. ఆ తర్వాత ఒక్కొక్కరూ యాడ్ అవుతూ టీమ్‌గా కలిసి పని చేశారు. ఈ సినిమా దిల్ రాజుకు నచ్చడం అనేది బిగ్గెస్ట్ కమర్షియల్ కొలబద్ద. ఈ సినిమా దర్శకుడు కశ్యప్ ఖచ్చితంగా చాలా ఇన్నోవేటివ్ డైరెక్టర్ అవుతాడు. ఇందులో ఇప్పటి వరకు చూడని కొత్త రకం కామెడీ ఉంటుంది. ఇందులో చాలామంది డైరెక్టర్స్ కనిపిస్తారు. కశ్యప్ ఎంతో మంది డైరెక్టర్స్‌తో పనిచేస్తూ తనకు కావాల్సింది రాబట్టుకున్నాడు. కొత్త రకం హ్యుమర్‌తో వస్తున్న ఈ సినిమాతో కచ్చితంగా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు’’ అని జె.డి. తెలిపారు.