సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Naga Vamsi: ‘జైలర్ 2’ టికెట్ రేట్లపై కొత్త చర్చ.. ప్రేక్షకులపై భారం తప్పదా?

ABN, Publish Date - Oct 10 , 2026 | 02:26 PM

సినిమా టికెట్‌ ధరల పెంపు ఇప్పుడు టాలీవుడ్‌లో మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కే చిత్రాలకు టికెట్‌ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించాలనే ప్రతిపాదన కొంతకాలంగా అమల్లో ఉంది.

Jailer 2

సినిమా టికెట్‌ ధరల పెంపు ఇప్పుడు టాలీవుడ్‌లో మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కే చిత్రాలకు టికెట్‌ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించాలనే ప్రతిపాదన కొంతకాలంగా అమల్లో ఉంది. అయితే, ఈ విషయంలో నిర్మాతలు ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని అనుసరిస్తున్నారు. కొందరు టికెట్‌ ధరలు పెంచకుండా ప్రేక్షకులకు అందుబాటు ధరల్లో సినిమాను అందించడానికే ప్రాధాన్యమిస్తుంటే.. మరికొందరు మాత్రం పెంపు ద్వారా అదనపు ఆదాయాన్ని రాబట్టాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘జైలర్‌ 2’ టికెట్‌ ధరల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ టికెట్‌ ధరల పెంపునకు దూరంగా ఉంటూ సాధారణ ధరలకే సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది.  రవితేజ కథానాయకుడిగా నటించిన ‘ఇరుముడి’ విషయంలోనూ ఇదే విధానాన్ని పాటించింది. ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్న ‘రణబాలి’ కూడా ఇదే విధానంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. టికెట్‌ ధరలు అందుబాటులో ఉంటే ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం ఉంటుందనే అంచనాతో కొందరు నిర్మాతలు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు.

అయితే, దసరా సందర్భంగా విడుదలకు సిద్ధమవుతున్న ‘జైలర్‌ 2’ విషయంలో నిర్మాత నాగవంశీ టికెట్‌ ధరల పెంపునకు మొగ్గుచూపినట్లు తెలిసింది.  తెలుగు రాష్ట్రాల్లో టికెట్‌పై రూ.50 నుంచి రూ. 75 వరకు ధరలు పెంచుకోవడానికి  వెసులుబాటు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో ఈ నిర్ణయంపై చర్చ మొదలైంది. డైరెక్ట్ తెలుగు సినిమాలకే  సాధారణ ధరలు కొనసాగిస్తుంటే, తమిళంలో రూపొందిన డబ్బింగ్‌ చిత్రానికి మాత్రం టికెట్‌ ధరలు పెంచడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ..

‘జైలర్‌ 2’ విషయంలో మరో అంశం కూడా చర్చకు వస్తోంది. తమిళనాడుతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో టికెట్‌ ధరలు ఎక్కువగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది.  తెలుగు మార్కెట్‌లో పోటీగా విడుదలయ్యే స్ట్రెయిట్‌ సినిమాలు సాధారణ ధరలకే అందుబాటులో ఉంటే, డబ్బింగ్‌ చిత్రానికి అదనపు ధరలు నిర్ణయించడం ప్రేక్షకుల ఆదరణపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

భారీ మొత్తానికి కొంటే.. భారం ప్రేక్షకులపైనా?

‘జైలర్‌ 2’ తెలుగు హక్కులను నాగవంశీ భారీ మొత్తానికి కొనుగోలు చేసి ఉండవచ్చు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినప్పుడు దాన్ని తిరిగి రాబట్టుకోవాలనే ఉద్దేశంతో టికెట్‌ ధరల పెంపును ఆశ్రయించాలనుకోవడం నిర్మాతల కోణంలో అర్థం చేసుకోవచ్చు. అయితే, పంపిణీ హక్కుల కోసం చెల్లించిన మొత్తం ఎంతైనా, దాని భారం నేరుగా ప్రేక్షకులపై పడాలా? అనే ప్రశ్న లేవనెత్తారు నెటిజన్లు. టికెట్‌ ధరలు పెంచడం వల్ల తొలి రోజుల్లో వసూళ్లు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, అధిక ధరలు సాధారణ ప్రేక్షకులను థియేటర్లకు దూరం చేసే ప్రమాదం కూడా ఉంది. సినిమా కంటెంట్‌పై సానుకూల స్పందన వస్తేనే ప్రేక్షకులు అదనపు ధరలను చెల్లించేందుకు ఆసక్తి చూపుతారు. లేదంటే అధిక టికెట్‌ ధరలు సినిమాపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఒక వారం సాధారణ  రేటుకు సినిమా చూసిన ప్రేక్షకుడు, మరో వారం అదే తరహా చిత్రానికి ఎక్కువ మొత్తం చెల్లించాల్సి రావడం ఎందుకనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ప్రస్తుతం జైలర్ 2 టికెట్ ధర పెంపు అనే అంశం చర్చగా మారింది.  ఈ పెంపునకు అధికారికంగా ఎలాంటి అనుమతులు లభించాయి, తుది ధరలు ఎంత ఉండనున్నాయి అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. 

Updated Date - Oct 10 , 2026 | 03:50 PM