సుకుమార్, విజయ్ దేవరకొండ సినిమా అటకెక్కినట్లేనా?
ABN, Publish Date - Sep 25 , 2026 | 12:25 PM
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో గతంలో ఓ సినిమా రానున్నట్లు ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో గతంలో ఓ సినిమా రానున్నట్లు ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి టాలీవుడ్ వర్గాలతో పాటు రౌడీ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ప్రకటన వచ్చి సుదీర్ఘకాలం అవుతున్నా.. ఇప్పటివరకు ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు. దీంతో అసలు వీరిద్దరి కలయికలో సినిమా ఉంటుందా? లేక తెరవెనుక మారిన సమీకరణాల వల్ల ఈ క్రేజీ ప్రాజెక్ట్ శాశ్వతంగా అటకెక్కినట్లేనా? అనే సందేహాలు మరోసారి సినీ వర్గాల్లో ఊపందుకుంటున్నాయి.
ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కకపోవడానికి బలమైన కారణాలే ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అందులో మొదటిది.. డైరెక్టర్ సుకుమార్ రేంజ్ పూర్తిగా మారిపోవడం. 'పుష్ప', 'పుష్ప 2' సినిమాలతో ఆయన పాన్ ఇండియా స్థాయిలో దేశంలోనే టాప్ డైరెక్టర్లలో ఒకరిగా నిలిచారు. ఆయన మార్కెట్ పరిధి ఇప్పుడు వందల కోట్లకు చేరింది. దీనికి తోడు, సుకుమార్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఖరారు చేసుకున్నారు.
ఇప్పటివరకు చూడని విధంగా చరణ్‌ను సరికొత్తగా చూపించడానికి సుకుమార్ పక్కా ప్లాన్ రెడీ చేశారట. ఈ పాత్ర కోసం చరణ్ ఏకంగా 15 కిలోల బరువు తగ్గనుండగా, నవంబర్ తర్వాత ఈ చిత్రాన్ని ప్రారంభించేందుకు ముహూర్తం సెట్ చేశారు. ప్రస్తుతం సుకుమార్ దృష్టి అంతా ఈ బిగ్ ప్రాజెక్ట్‌పైనే ఉండటంతో.. విజయ్ దేవరకొండతో అనుకున్న సినిమా సుకుమార్ ప్రాధాన్యత జాబితాలో వెనకబడిపోయిందనే టాక్ వినిపిస్తోంది.
మరోవైపు విజయ్ దేవరకొండ కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇటీవల రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'రణబాలి' చిత్రాన్ని విజయ్ పూర్తి చేశారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 16న గ్రాండ్‌గా విడుదలకానుంది.
'రణబాలి' ముగియగానే ఏమాత్రం విరామం తీసుకోకుండా రవికిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రౌడీ జనార్దన' షూటింగ్‌లో విజయ్ నిమగ్నమయ్యారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండింటితో పాటు 'హాయ్ నాన్న' ఫేమ్ శౌర్యువ్ దర్శకత్వంలో ఒక ఎమోషనల్ చిత్రాన్ని లైన్‌లో పెట్టారు విజయ్. ఇప్పటికే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమై, రెగ్యులర్ షూటింగ్‌కు సిద్ధమవుతోంది.
ఇలా ఇద్దరి షెడ్యూల్స్ రాబోయే రెండేళ్ల వరకు ఫుల్ అయిపోవడంతో విజయ్ దేవరకొండ - సుకుమార్ సినిమా ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. అయితే ఇది పూర్తిగా రద్దయిందా? లేక కేవలం ఆలస్యం అవుతోందా? అనే దానిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ భవిష్యత్‌లో ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని రౌడీ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి ఈ కాంబో మళ్లీ పట్టాలెక్కుతుందో లేదో చూడాలి.