Irumudi Vs VAS: ‘ఇరుముడి’ దూకుడు.. సూర్య ‘VAS’కు గట్టి పోటీ
ABN , Publish Date - Aug 22 , 2026 | 06:24 PM
‘ఇరుముడి’(Irumudi)చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు మాస్ మహారాజా రవితేజ. ఆయన హీరోగా శివ నిర్వాణ తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
‘ఇరుముడి’(Irumudi)చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు మాస్ మహారాజా రవితేజ. ఆయన హీరోగా శివ నిర్వాణ తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రానికి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద జోరు కనిపిస్తోంది. మాస్ ప్రేక్షకులతో పాటు కుటుంబ ప్రేక్షకుల నుంచి కూడా సినిమాకు మంచి స్పందన రావడం చిత్రానికి కలిసొచ్చే అంశంగా మారింది. ‘ఇరుముడి’ తొలి రోజే సుమారు రూ.23–25 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మౌత్ టాక్ తో వీకెండ్‌లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రవితేజకు ఉన్న మాస్ ఫాలోయింగ్, పాజిటివ్ రెస్పాన్స్ కలిసి బాక్సాఫీస్ వద్ద మంచి నంబర్లు తీసుకొచ్చే అవకాశం ఉంది. ‘ఇరుముడి’ దూకుడు ఇప్పుడు ఇప్పటికే థియేటర్లలో ఉన్న ‘విశ్వనాథ్ & సన్స్’కు (Vishwanath and sons) కొంత పోటీగా మారే పరిస్థితి కనిపిస్తోంది. సూర్య నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. విడుదలైనప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా డీసెంట్ బిజినెస్ చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే లాభాల జోన్‌లోకి వెళ్లినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
రెండో వీకెండ్‌లోకి అడుగుపెడుతున్న సమయంలో ‘ఇరుముడి’ రావడం సూర్య సినిమాకు సవాల్‌గా మారింది. ‘ఇరుముడి’ ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకర్షిస్తుండటంతో థియేటర్లలో ప్రేక్షకులు డివైడ్ అయ్యే అవకాశం ఉంది. ‘విశ్వనాథ్ & సన్స్’కు కొన్ని కేంద్రాల్లో ఆక్యుపెన్సీ తగ్గే అవకాశాలు లేకపోలేదు. అలాగని పూర్తిగా ఇబ్బందికర పరిస్థితి ఉందని చెప్పలేం. ఇప్పటికే సినిమాకు వచ్చిన టాక్, తెలుగు రాష్ట్రాల్లో సాధించిన వసూళ్లు దానికి బలంగా మారాయి. సినిమా లాభాల దిశగా సాగుతుండటంతో వచ్చే కలెక్షన్లు మరింత ప్లస్‌గా మారనున్నాయి. ‘విశ్వనాథ్ & సన్స్’కు తమిళనాడు మార్కెట్లో కాస్త నెగటివ్ ఉంది. అక్కడ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోతోందనే టాక్ ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో తన హోల్డ్‌ను కొనసాగించడంతో పాటు తమిళనాడులో కూడా పుంజుకోవాల్సిన అవసరం ఉంది. ‘ఇరుముడి’ పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూకుడు చూపిస్తుండగా, VAS రెండో వీకెండ్‌లో ఎంతవరకు నిలబడుతుందనేది ఆసక్తికరంగా మారింది.