చైతూ నుంచి రవితేజకు ఎలా మారింది అంటే
ABN , Publish Date - Feb 10 , 2026 | 02:39 PM
దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకుడిగా పరిచయమైన తొలి చిత్రం ‘నిన్ను కోరి’. ఈ సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత నాగచైతన్యతో చేసిన ‘మజిలీ’ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుని మంచి వసూళ్లను రాబట్టింది.
దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకుడిగా పరిచయమైన తొలి చిత్రం ‘నిన్ను కోరి’. ఈ సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత నాగచైతన్యతో చేసిన ‘మజిలీ’ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుని మంచి వసూళ్లను రాబట్టింది. ఈ రెండు సినిమాల తర్వాత శివ నిర్వాణ – నాగచైతన్య (Naga Chaitanya) కాంబో కొనసాగుతుందని అందరూ భావించారు. కానీ ఈ కాంబో వర్కవుట్ కాలేదు. తదుపరి శివ నిర్వాణ ‘టక్ జగదీష్’, ‘ఖుషి’ చిత్రాలు తీశారు. ఆ రెండూ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. దీంతో మరో బలమైన కథతో తిరిగి రావాలన్న ఆలోచనతో ‘ఇరుముడి’ కథ సిద్ధం చేశారు. రవితేజ హీరోగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
అసలు విషయం ఏంటంటే.. ‘ఇరుముడి’ కథ మొదటగా నాగచైతన్యకే వినిపించారట శివ నిర్వాణ. చైతూకి నచ్చినప్పటికీ, నిర్ణయం తీసుకోవడంలో కొంత ఆలస్యం జరిగింది. ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుండటం, మరోవైపు నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ నుండి వెంటనే సినిమా ప్రారంభించాలనే ఒత్తిడి ఉండటంతో ఈ కథ రవితేజ చెంతకు చేరింది. రవితేజ కథ విని త్వరగా నిర్ణయం తీసుకున్నారు. దానితో ‘ఇరుముడి’ రవితేజ ఖాతాలోకి వెళ్లింది. చైతూ వెంటనే నిర్ణయం తీసుకుని ఉంటే ఈ కథ దారి మళ్లేది కాదన్న అభిప్రాయం ఇప్పుడు వినిపిస్తోంది. ఈ కథను వదిలేయడం నాగ చైతన్యకు ప్లస్ అవుతుందా.. మైనస్ అవుతుందా అన్నది తెలియాలంటే ‘ఇరుముడి’ సినిమా విడుదల అయ్యే వరకు వేచి ఉండాలి.