Varanasi: దెబ్బ గట్టిగానే పడేలా ఉందిగా.. ఇప్పుడేం చేస్తాడు జక్కన్న?
ABN, Publish Date - Nov 19 , 2026 | 04:08 PM
ఒకప్పుడు టాలీవుడ్లో వేసవి సెలవులు వచ్చాయంటే బాక్సాఫీస్ దగ్గర పండగ వాతావరణం కనిపించేది. బడా నిర్మాతలంతా సమ్మర్ స్లాట్ల కోసమే పోటీ పడేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది.
ఒకప్పుడు టాలీవుడ్లో వేసవి సెలవులు వచ్చాయంటే బాక్సాఫీస్ దగ్గర పండగ వాతావరణం కనిపించేది. బడా నిర్మాతలంతా సమ్మర్ స్లాట్ల కోసమే పోటీ పడేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. ఎప్పుడైతే ఐపీఎల్ దేశవ్యాప్తంగా ఒక మహా పండుగలా మారిపోయిందో, అప్పటి నుంచి సినిమా కలెక్షన్లకు గట్టి బ్రేకులు పడుతున్నాయి. సాయంత్రం ఏడున్నర దాటితే చాలు.. థియేటర్లలో ఉండాల్సిన జనం టీవీ స్క్రీన్లకు, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఎంత పెద్ద సినిమా అయినా సరే, సాయంత్రం ఆటలకు జనం రాకపోతే వసూళ్లు కుదేలవ్వడం ఖాయం. అందుకే మన నిర్మాతలంతా సమ్మర్ వేడికి దూరంగా ఉంటూ, సంక్రాంతికో లేక దసరా సీజన్‌కో క్యూ కడుతున్నారు.
ఈ క్రమంలోనే ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అపజయం ఎరుగని దర్శకుడిగా పేరుగాంచిన రాజమౌళి (Rajamouli) సైతం ఐపీఎల్ దెబ్బకు వెనకడుగు వేయక తప్పడం లేదనే టాక్ బలంగా వినిపిస్తుంది. మహేష్ బాబు (Mahesh Babu) తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసి (Varanasi) రిలీజ్ డేట్ మారబోతోందా..? అంటే.. అవుననే సమాధానాలు బలంగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ మొదట భావించింది. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో, ఆ డేట్‌ను మార్చక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్.
తెలుగు రాష్ట్రాల్లో ఎలాగోలా నెట్టుకొచ్చినా, నార్త్ ఇండియా మెట్రో నగరాల్లో పరిస్థితి వేరేలా ఉంటుంది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా లాంటి నగరాల్లో ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో మల్టీప్లెక్స్‌లలో సాయంత్రం షోలు చాలావరకు ఖాళీగా దర్శనమిస్తుంటాయి. ఈ సినిమా బడ్జెట్ దాదాపు వెయ్యి కోట్లకు పైమాటే. అలాంటి భారీ చిత్రాన్ని రికవరీ చేయాలంటే నార్త్ బెల్ట్ తోపాటు అంతర్జాతీయ మార్కెట్ అత్యంత కీలకం. హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్లతో, అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై రాజమౌళి వేసిన అంచనాలు మామూలుగా లేవు.
పైగా నార్త్ మార్కెట్‌పై ఆయన పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. అలాంటి పరిస్థితుల్లో, ఐపీఎల్ హవా నడుస్తుండగా ఏప్రిల్ మొదటి వారంలో సినిమాను థియేటర్లలోకి దించడం అంటే సాహసోపేతమైన నిర్ణయమని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఒక్క సాయంత్రం షో తగ్గాయా.. కలెక్షన్లలో కోట్లాది రూపాయల గండి పడుతుంది. అందుకే రాజమౌళి అలాంటి రిస్క్ తీసుకోదల్చుకోలేదు. అందుకే ఐపీఎల్ హడావుడి పూర్తిగా ముగిసిన తర్వాతే ఈ దృశ్య కావ్యాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీమ్ ఒక నిర్ణయానికి వచ్చిందట. ఇందులో భాగంగానే జులై 31వ తేదీని లాక్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఈ జులై 31 వెనుక బలమైన సెంటిమెంట్ కూడా ఉంది.
రాజమౌళి కెరీర్‌ను ఊహించని మలుపు తిప్పి, టాలీవుడ్ రికార్డులను తిరగరాసిన మగధీర విడుదలైన తేదీ కూడా జులై 31నే. ఆ సినిమా ఇచ్చిన అపూర్వ విజయం దృష్టిలో ఉంచుకుని, వారణాసి కి కూడా అదే తేదీ కలిసొస్తుందని భావిస్తున్నారట. సమ్మర్ వెకేషన్ కంటే కూడా, వర్షాకాలం ఆరంభంలో ఎలాంటి పోటీ లేకుండా సోలోగా థియేటర్లను షేక్ చేయవచ్చనేది జక్కన్న వ్యూహం. రికార్డులను సృష్టించడంలో దిట్ట అయిన రాజమౌళి లాంటి అగ్ర దర్శకుడు కూడా ఐపీఎల్ ప్రభావానికి తలొగ్గి డేట్ మారుస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు.. దేశంలో క్రికెట్ మానియా ఏ స్థాయిలో ఉందో అని. అయితే జులై 31కి వచ్చినా, మరే తేదీకి వచ్చినా.. వారణాసి బాక్సాఫీస్ దగ్గర సృష్టించబోయే ప్రభంజనం మాత్రం ఆగదు అనేది సినీ అభిమానుల గట్టి నమ్మకం.