మొదలైన విప్లవ వీరుడు షూటింగ్
ABN, Publish Date - Feb 09 , 2026 | 04:24 PM
సీనియర్ నటి ఇంద్రజ కీలక పాత్ర పోషిస్తున్న సినిమా 'విప్లవ వీరుడు'. ఈ సినిమా షూటింగ్ సోమవారం పూజా కార్యక్రమాలతో ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో మొదలైంది.
భారత స్వాతంత్ర సంగ్రామంలో సామాన్యులే వీరులై పోరాడిన చరిత్రను తెరకెక్కిస్తున్న మూవీ ‘విప్లవ వీరుడు’ (Viplava Veerudu). ప్రముఖ నటి ఇంద్రజ (Indraja) కీలక పాత్రలో జైశ్వర్, సోనాలి జంటగా ఎస్ నాగరాజ్ రావు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఏవీ జయరాం దీనిని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఫిలింనగర్ దైవ సన్నిధానంలో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి ఇంద్రజపై ప్రముఖ రచయిత, దర్శకులు పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopalakrishna) క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా ఇంద్రజ మాట్లాడుతూ, 'స్వాతంత్ర కాలం నాటి కథను చాలా సహజంగా తెరకెక్కించబోతున్నారు. సామాన్య ప్రజలు కూడా స్వాతంత్ర పోరాటంలో ఎలా పాల్గొన్నారు అనే అంశాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఒక సామాన్యుడు విప్లవ వీరుడిగా మారి స్వతంత్ర ఉద్యమంలో విరోచితంగా పోరాడే కథ ఇది. ఈ చిత్రంలో నేను రాణి భవానిదేవి పాత్రలో కనిపించబోతున్నాను. బ్రిటిష్ వారిని ఎలా ఎదుర్కొన్నామన్నదే కథాంశం. అర్థవంతమైన కథతో నిర్మాత జయరాం మంచి సినిమా నిర్మిస్తున్నారు. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి' అని అన్నారు.
హీరో జైశ్వర్ మాట్లాడుతూ, 'విప్లవ వీరుడు పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నాను. ఈ పాత్ర నాకు ఎంతో ప్రత్యేకం. ఈ సినిమా చరిత్రలో నిలిచిపోతుంది' అని చెప్పారు. హీరోయిన్ సోనాలి మాట్లాడుతూ, 'ఇంత గొప్ప చిత్రంలో నాకు అవకాశం ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞతలు. ఇది నా మొదటి సినిమా. మీ అందరి ఆశీర్వాదం కావాలి' అని అన్నారు.
దర్శకుడు ఎస్ నాగరాజు రావు మాట్లాడుతూ, 'ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. బ్రిటిష్ కాలం నాటి హిస్టారికల్ స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఇందులో ఇంద్రజ గారు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు' అని తెలిపారు. నిర్మాత ఏవీ జయరాం మాట్లాడుతూ, 'ఇది టిప్పు సుల్తాన్ కాలం నాటి కథ ఇది. బ్రిటిష్ వారు వ్యాపారం పేరుతో దేశాన్ని ఎలా దోచుకున్నారో, ఆ పరిణామాలను ఈ సినిమాలో చూపిస్తున్నాం. మంచి సందేశం ఉన్న చిత్రమిది' అని చెప్పారు.