ఐపీయల్‌లో ఎ. ఆర్. రహమాన్ లైవ్ పెర్ఫామెన్స్
ABN, Publish Date - Mar 16 , 2026 | 04:25 PM
మరి కొద్ది రోజుల్లో ఐపీయల్ క్రికెట్ సీజన్ స్టార్ట్ కానుంది. ఐపీయల్‌లో ఈ సారి మరింత జోష్ నింపడానికి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధమవుతున్నట్టు సమాచారం.
ఈ సారి 'ఇండియన్ ప్రీమియర్ లీగ్' (IPL) క్రికెట్ మ్యాచెస్ మార్చి 28న ఆరంభం కానున్నాయి. తొలి మ్యాచ్‌లో ప్రస్తుత విజేత 'రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు' తో 'సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్' తలపడనుంది. ఇక ఈ సారి ఐపీయల్‌లో ఫ్యాన్స్‌కు మరింత ఉత్సాహం కలిగిస్తూ ఆస్కార్ అవార్డు విజేత ఎ.ఆర్. రహమాన్ (A.R. Rahman) లైవ్ పెర్ఫామెన్స్ కూడా చోటు చేసుకోనుందట. ముఖ్యంగా రహమాన్ బాణీలు సమకూర్చిన తెలుగు సినిమా 'పెద్ది' (Peddi) పాటలు ప్రధానాంశంగా ఈ లైవ్ షో సాగనుంది. ఇప్పటికే 'పెద్ది'లోని రెండు పాటలు మిలియన్స్ కొద్దీ వ్యూస్ సంపాదిస్తూ సినీ అభిమానులను, మ్యూజిక్ లవర్స్‌ను ఆకర్షిస్తున్నాయి. ఇక రహమాన్ లైవ్ షోతో 'పెద్ది' పాటలకు మరింత ఊపు లభిస్తుందని తెలుస్తోంది. ఐపీయల్ మ్యాచ్‌కు ముందుగానే 'చెన్నై సూపర్ కింగ్స్' మార్చి 22వ తేదీన గ్రాండ్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేయనుంది. అందులోనే రహమాన్ లైవ్ పెర్ఫామెన్స్ కూడా ఉంటుందని తెలుస్తోంది.
మన దేశంలో క్రికెట్ ఆటకు ఉన్నంతమంది అభిమానులు మరే ఆటకూ లేరంటే అతిశయోక్తి కాదు. వారందరికీ ఆనందం పంచుతూ 2008 నుండి ఐపీయల్ క్రికెట్ సీజన్స్ సాగుతున్నాయి. పదిహేడు ఏళ్ళుగా మురిపిస్తున్న ఐపీయల్ మ్యాచెస్‌లో గత సంవత్సరం సినిమా జోష్‌నూ మిక్స్ చేశారు. గత యేడాది మార్చి 22న ఐపీయల్ సీజన్ మొదలయింది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మ్యాచ్ జరిగింది. ఈ ఓపెనింగ్ సెర్మనీలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ, గాయని శ్రేయా ఘోషల్, పంజాబీ కళాకారుడు కరణ్ ఔజ్లా తమ ప్రదర్శనతో సందడి చేశారు. ఆ సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఈ సారి ఎ. ఆర్. రహమాన్ గానకచేరీ సాగనుందని తెలుస్తోంది. ఐపీయల్‌లో ఇప్పటి దాకా అత్యధిక సార్లు విజేతలుగా నిలచిన ఘనతను 'చెన్నై సూపర్ కింగ్స్', 'ముంబై ఇండియన్స్' జట్లు సాధించాయి. ఈ రెండు జట్లు చెరో ఐదు సార్లు విన్నర్స్‌గా నిలిచాయి. 'చెన్నై సూపర్ కింగ్స్'కు మరింత జోష్ తీసుకువచ్చేందుకే ఎ.ఆర్. రహమాన్ లైవ్ పెర్ఫామెన్స్‌ను జోడించారని తెలుస్తోంది.
ఈ సారి జరగబోయే ఐపీయల్ టోర్నమెంట్‌లో పది జట్లు మొత్తం 84 మ్యాచెస్ ఆడనున్నాయి. మార్చి 28 నుండి మే 31 దాకా ఈ సీజన్ సాగనుంది. ఫైనల్‌ను బెంగళూరులో నిర్వహించనున్నారు. ఈ ఐపీయల్ కారణంగా రామ్ చరణ్ (Ramcharan) హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన 'పెద్ది'కి కూడా ఓ స్పెషల్ క్రేజ్ క్రియేట్ అయ్యేలా ప్లాన్ చేశారు. అందులో భాగంగానే రహమాన్ 'పెద్ది' సాంగ్స్ లైవ్ పెర్ఫామెన్స్ ఉంటోంది. 'పెద్ది' చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది. అప్పటికి ఇంకా ఐపీయల్ మ్యాచెస్ సాగుతూ ఉంటాయి. అందువల్ల ఐపీయల్‌లో క్రికెట్ ఫ్యాన్స్ ను సైతం 'పెద్ది' సాంగ్స్ ఆకర్షించి, ఆ మూవీ రిలీక్‌కు జనాన్ని థియేటర్స్‌కు పరుగులు తీసేలా ప్లాన్ చేశారు. ఇప్పటి వరకూ ఎ.ఆర్. రహమాన్ స్వరకల్పన చేసిన స్ట్రెయిట్ తెలుగు మూవీ ఏదీ సక్సెస్ రూటులో సాగలేదు. ఆ లోటును 'పెద్ది' తీరుస్తుందని తొలి నుంచీ వినిపిస్తోంది. అందుకు ఈ ఐపీయల్ లో సాగే రహమాన్ లైవ్ పెర్ఫామెన్స్ కూడా దోహదం చేస్తుందేమో చూడాలి.