అప్పులు తీరేనా.. స్లమ్‌డాగ్ వచ్చేనా! పూరికి.. గత వైభవం దక్కేనా
ABN , Publish Date - Apr 23 , 2026 | 04:41 PM
సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కెరీర్‌లోనే అత్యంత క్లిష్టమైన బ్యాడ్ టైమ్‌ను ఫేస్ చేస్తున్నారు. ముఖ్యంగా స్లమ్‌డాగ్ సినిమా చుట్టూ ఇప్పుడు నెలకొన్న పరిస్థితులు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
టాలీవుడ్‌లో ఒకప్పుడు సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు..స్టార్ హీరోలందరి హాట్ ఫేవరెట్.. అంటే ముందు వినిపించే పేరు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh). ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న పూరీ ఎంత పెద్ద సినిమాను అయినా చాలా తక్కువ సమయంలో పూర్తి చేయడంలో దిట్ట. అప్పట్లో పూరీ సినిమా అంటే చాలు బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురవాల్సిందే. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రస్తుతం ఈ సెన్సేషనల్ డైరెక్టర్ కెరీర్‌లోనే అత్యంత క్లిష్టమైన బ్యాడ్ టైమ్‌ను ఫేస్ చేస్తున్నారు. ఆయన సృష్టించిన వండర్స్ ఒక వైపైతే.. ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్న వివాదాలు, ఆర్థిక ఇబ్బందులు మరోవైపు ఉన్నాయి. ముఖ్యంగా స్లమ్‌డాగ్ సినిమా చుట్టూ ఇప్పుడు నెలకొన్న పరిస్థితులు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
'లైగర్' సినిమాతో అసలు సమస్య మొదలైంది. పాన్ ఇండియా రేంజ్‌లో భారీ అంచనాలతో వచ్చిన ఆ చిత్రం ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ సినిమా నష్టాల వల్ల డిస్ట్రిబ్యూటర్లు రోడ్డున పడ్డారు. ఆ సమయంలో వారికి కొంత వరకు బాధ్యత వహిస్తానని, నష్టపరిహారం అందిస్తానని పూరీ హామీ ఇచ్చారు. కానీ, ఆ తర్వాత ఎంతో నమ్మకంతో చేసిన డబుల్ ఇస్మార్ట్ కూడా బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేసింది. దీంతో డిస్ట్రిబ్యూటర్ల కష్టాలు రెట్టింపు అయ్యాయి. మొదటి సినిమా నష్టాలే తీరలేదు అనుకుంటే, రెండో సినిమా కూడా దెబ్బకొట్టడంతో తలనొప్పులు మళ్లీ మొదటికి వచ్చాయి.
ఇప్పుడు అసలు కథ స్లమ్‌డాగ్ దగ్గరికి వచ్చింది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) లీడ్ రోల్‌లో పూరీ తెరకెక్కించిన ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ఈ కాంబినేషన్ మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. కానీ, సినిమా రిలీజ్ చేయడానికి పూరీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాత బకాయిలు తీరిస్తేనే ఈ సినిమాను థియేటర్లలోకి రానిస్తాం అంటూ డిస్ట్రిబ్యూటర్లు భీష్మించుకుని కూర్చున్నారు. థియేటర్ రిలీజ్ మాత్రమే కాదు, ఓటీటీ డీల్స్ విషయంలో కూడా ఇదే నిబంధన అడ్డుపడుతోంది. బకాయిలు క్లియర్ చేయకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా ముందడుగు వేయడం లేదు.
ప్రస్తుతం పూరీ ఈ ఆర్థిక సమస్యలను అధిగమించే పనిలో బిజీగా ఉన్నారు. ఎలాగైనా పాత అప్పులను క్లియర్ చేసి, స్లమ్‌డాగ్ సినిమాను ప్రేక్షకులకు అందించాలని చూస్తున్నారు. తన మార్కు డైలాగులతో, క్యారెక్టరైజేషన్‌తో మ్యాజిక్ చేసే పూరీ.. ఈ రియల్ లైఫ్ క్రైసిస్ నుంచి ఎలా బయట పడతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒక సినిమా సక్సెస్ అయితేనే ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి. మరి విజయ్ సేతుపతి సినిమా పూరీకి ఆ ఊపిరిని ఇస్తుందో లేదో చూడాలి. ఏది ఏమైనా, పూరీ జగన్నాథ్ లాంటి ప్రతిభావంతుడైన దర్శకుడు మళ్ళీ తన ఫామ్ అందుకుని, మునుపటి వైభవాన్ని చూడాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. విజయ్ సేతుపతి లాంటి వెర్సటైల్ యాక్టర్ పూరీ విజన్ కలిస్తే ఎలా ఉంటుందో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.