సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Priyadarshi: 'ఇడుపు కాయితం'పై రచ్చ... అదీ మంచిదే!

ABN, Publish Date - Jun 26 , 2026 | 05:11 PM

'ఇడుపు కాయితం' సినిమాకు ఇలా క్లాప్ కొట్టారో లేదో... అలా టైటిల్ పై రచ్చ మొదలైంది. తెలంగాణ మాండలీకానికి చెందిన ఈ టైటిల్ చాలామందికి అర్థం కాదనే విమర్శలు వస్తున్నాయి. అయితే దానికి దీటుగా తెలంగాణ వాదులు బదులిస్తున్నారు.

Idupu Kagitham Movie

ప్రియదర్శి, నాగదుర్గ జంటగా గురువారం మొదలైన 'ఇడుపు కాయితం' మూవీ పూజా కార్యక్రమాలతో ఇలా మొదలైందో లేదో సోషల్ మీడియాలో రచ్చ అలా మొదలైపోయింది. ఈ పదం అర్థం తెలియక కొందరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో మాటల యుద్థం స్టార్ట్ అయ్యింది. ఈ టైటిల్‌ మీద అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ ప్రాంతీయాభిమానులు వాదోపవాదాలు చేసుకుంటున్నారు.

సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్‌పై సుకుమార్ సతీమణి తబిత, బన్నీ వాస్‌ కలిసి 'ఇడుపు కాయితం' అనే సినిమాను ప్రారంభించారు. తెలంగాణలో 'ఇడుపు కాగితం' అంటే విడాకుల కాగితం అని అర్థం. విడాకుల నేపథ్యంలో సాగే ఈ గ్రామీణ నేపథ్య చిత్రంపై మేకర్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాను వంశీరెడ్డి దొండపాటి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం రోజున తబిత మాట్లాడుతూ, 'తెలంగాణ మహిళగా ఈ కథతో తాను బాగా కనెక్ట్ అయ్యానని, సుకుమార్ కనెక్ట్ అవుతారో లేదో తనకు తెలియదని, అయినా ఈ సినిమాను నిర్మించా ల్సిందేనని తాను పట్టు పట్టాన'ని తెలిపారు. ఈ సినిమాలో నటించడం పట్ల ప్రియదర్శి, నాగదుర్గ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణాకు చెందిన పలువురు టీవీ మీడియా ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రామ్స్ చేసే వారు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ జనాల నోట్లో నానే ఈ పేరు పట్ల చాలామంది హర్షం వ్యక్తం చేశారు. అచ్చ తెలంగాణా చిత్రంగా ఇది తెరకెక్కుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.


ఇంతవరకూ బాగానే ఉంది. అయితే 'ఇడుపు కాయితం' అంటే అర్థం తెలియని కొందరు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రచ్చకు దారితీశాయి. ఈ చిత్రాన్ని తెలుగు భాషలోకి అనువాదిస్తారా? అంటూ కొందరు వ్యాఖ్యానించగా, కాస్తంత అర్థమయ్యే పేరు పెట్టొచ్చు కదా! అని మరి కొందరు పోస్టులు పెట్టారు. నిజానికి ప్రస్తుతం తెలుగులో 'తెల్ల కాగితం' అనే సినిమా ఒకటి విడుదలకు సిద్థంగా ఉంది. ఆ వెంటనే 'ఇడుపు కాయితం' అనే పేరుతో మరో సినిమా వస్తుండటంతో చాలామందికి ఇదేం కాగితం? అనే సందేహం కలిగింది. అయితే కొందరు ఇలా వేసిన ప్రశ్నలో వెటకారం కనిపించడంతో తెలంగాణ వాదులకు కోపం వచ్చింది. తెలంగాణ యాసను అవమానిస్తున్నట్టుగా వారు భావించారు. ఇంకొందరు తెలంగాణా వాదులైతే, ఈ టైటిల్ వినగానే ఇలాంటి వివాదం ఏదో వస్తుందని తాము ముందే ఊహించామని అలానే జరిగిందని తెలిపారు. తెలుగు సినిమాల్లో తమకు అర్థం కాని ఆంధ్ర పదాలు ఎన్నో ఉన్నా... వాటి అర్థం వేరే వారిని అడిగి తెలుసుకున్నాం తప్పితే, ఇలా వ్యంగ్యంగా వ్యవహరించలేదని మరికొందరు వాపోయారు.

చిత్రం ఏమంటే... ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి లాంటి వారికి సైతం 'ఇడుపు కాయితం' టైటిల్‌పై కొందరు చేసిన వ్యాఖ్యలు ఆగ్రహాన్ని తెప్పించాయి. 'ఇడుపు కాయితం పేరులో, భావంలో స్పష్టత ఉంది. విడిపోయే కాగితం అని. విడిపోయేటప్పుడు రాసుకునే ఒక పత్రమది. ఎందుకురా ఇంత ఓర్వలేని తనం. మరి విడాకులు లో ఏముందిరా! ఆకులా? అర్థంకాకపోతే మూసుకోండి. సబ్ టైటిల్స్ ఉండవు. చూడకండి!' అంటూ ఘాటుగా స్పందించారు.


ఏదేమైనా... 'ఇడుపు కాయితం' సినిమాను క్లాప్‌ కొట్టి నిర్మాతలు ఇలా మొదలు పెట్టారో లేదో అలా సోషల్ మీడియా రచ్చ జరగడంతో ఈ సినిమాకు మంచి మైలేజ్ వచ్చింది. బోలెడంత ఫ్రీ పబ్లిసిటీ జరిగింది. 'బలగం' సినిమాలో నటించిన ప్రియదర్శి ఈ సినిమాలో నటించడం, జానపద గీతాలతో పాపులారిటీ పొందిన నాగదుర్గ ఇందులో హీరోయిన్‌గా నటించడమే ఓ ప్లస్ పాయింట్‌ అనుకుంటే.... ఇప్పుడు ఇలా జరుగుతున్న పబ్లిసిటీతో సినిమాకు మంచి రీచ్‌ ఏర్పడింది. సో... మరక కూడా మంచిదే అన్నట్టుగా... సినిమా విషయంలో రచ్చ కూడా మంచిదే అంటున్న వారూ లేకపోలేదు.

ఇవి కూడా చదవండి:

నిన్న రిజిస్టర్ మ్యారేజ్.. నేడు సంప్రదాయం ప్రకారం ఫైమా పెళ్లి

ఈ అమ్మాయికి పిలిచి అవకాశం ఇస్తే.. 15 కండీషన్లు పెట్టింది: బన్నీ వాసు

Tollywood: పర్శంటేజ్‌ పై ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ షరతులు!

Updated Date - Jun 26 , 2026 | 05:49 PM