Nitesh Tiwari: నేను అన్ని తెలుగు సినిమాలు.. చూస్తాను! అసలు రాంగోపాల్ వర్మ ఎవరని తెలుసుకున్నా

ABN , Publish Date - Oct 20 , 2026 | 10:21 AM

‘రామాయణం’ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు నితేష్ తివారీ తెలుగు సినిమాలపై తన అభిమానాన్ని వెల్లడించారు.

Nitesh Tiwari

భారతీయ ఇతిహాసాల్లో రామాయణానికి ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి మహాగాథను అంతర్జాతీయ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నమే ‘రామాయణం’ (Ramayana Movie). రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), రాకింగ్ స్టార్ యశ్ (Yash), సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా తొలి భాగం నవంబర్ 5న విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎస్‌వీసీ ద్వారా గ్రాండ్ రిలీజ్‌కు ఏర్పాట్లు చేస్తుండటంతో హైదరాబాద్‌లో తెలుగు ప్రీ-రిలీజ్ వేడుక నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా డైరెక్టర్ నితేష్ తివారీ (Nitesh Tiwari) మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇక్కడ ప్రేక్షకుల ఉత్సాహాన్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇదంతా సినిమా చేసిన మ్యాజిక్. నేను హిందీలో ‘శివ’ సినిమా చూశాను. అప్పటికి నాకు ఆ సినిమా గురించి ఏమీ తెలియదు. ఆ సినిమా చూసి నాగార్జున గారిని, అమల గారిని, వాళ్ల ప్రెజెంటేషన్‌ను చూసి ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత అసలు రాంగోపాల్ వర్మ ఎవరు అని తెలుసుకున్నాను. అలాగే ‘ప్రతిబంధ్’ సినిమా కూడా నన్ను ఆశ్చర్యపరిచింది.


నేను దాదాపుగా అన్ని తెలుగు సినిమాలు చూస్తాను. ‘గీతాంజలి’, ‘క్షణక్షణం’ సినిమాలన్నీ తెలుగులోనే చూశాను. అందులోని పాటలు కూడా నాకు తెలుసు. ఆ తర్వాత ‘ఈగ’, ‘మగధీర’, ‘బాహుబలి’ ఇలా అన్ని సినిమాలను హిందీలో చూశాను. నాకు రాజమౌళి గారు, సుకుమార్, త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్.. ఇలా అందరి సినిమాలంటే ఇష్టం. ఇప్పుడు మా ‘రామాయణ’ సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. మీరు తెలుగులో చూసినా, హిందీలో చూసినా అదే ప్రేమను అందిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.

నిర్మాత నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ వేడుక ద్వారా తెలుగు ప్రేక్షకులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా డైరెక్టర్ నితీష్ తివారీ లేకపోతే ఈ జర్నీ సాధ్యమయ్యేది కాదు.ఈ సినిమాలో దిల్ రాజు గారు భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ఇంత అద్భుతమైన, హై క్వాలిటీ స్టోరీ టెల్లింగ్‌ను ప్రపంచానికి అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన సపోర్ట్‌ను మర్చిపోలేము.

అలాగే ధర్మ ప్రొడక్షన్స్ నార్త్‌లో ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది.మనమందరం తరతరాలుగా ‘రామాయణం’ వింటూ పెరిగాం. ఇది కేవలం సినిమా కాదు.. అంతకంటే ఎక్కువ. రామాయణం అంటేనే ఒక యూనివర్స్. ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా ఇది. ఈరోజు భారతీయ సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. ఆ గుర్తింపును మరో స్థాయికి తీసుకెళ్లేలా ఈ సినిమాను తీర్చిదిద్దడం జరిగింది. మన కథను ప్రపంచానికి తీసుకెళ్తున్నాం. మీ అందరి ప్రేమ, అభిమానాలు మాకు కావాలి.

Updated Date - Oct 20 , 2026 | 10:43 AM