Mysskin: విజయ్ సేతుపతి ఒక అగ్నిపర్వతం
ABN , Publish Date - Jul 14 , 2026 | 10:11 AM
దర్శకుడు మిష్కిన్‌ను తాను ఒక సైకో అని భావించానని, కానీ ఆయన రూపొందించిన ‘సైకో’ సినిమా చూశాక ఆయన అభిమానిగా మారిపోయానని ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి పేర్కొన్నారు.
దర్శకుడు మిష్కిన్‌ను (Mysskin)తాను ఒక సైకో అని భావించానని, కానీ ఆయన రూపొందించిన ‘సైకో’ సినిమా చూశాక ఆయన అభిమానిగా మారిపోయానని ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) పేర్కొన్నారు. మిష్కిన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, నాజర్, శృతిహాసన్, యోగిసేతు, నరైన్, కేఎస్ రవికుమార్, సంపత్ రాజ్, కలైయరసన్, అజయ్ రత్నం, విన్సెంట్ అశోకన్, బబ్లూ పృథ్విరాజ్ తదితరులు నటించిన చిత్రం ‘ట్రైన్’. వి క్రియేషన్స్ పతాకంపై నిర్మాత కలైపులి ఎస్.థాను భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ఆడియో, ట్రైలర్ ను ఇటీవల విడుదల చేశారు.
ఈ సందర్భంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ ‘నేను జూనియర్ ఆర్టిస్టుగా ఉన్న సమయంలో మిష్కిన్ చిత్రం కోసం ఆడిషన్స్‌కు వెళ్ళాను. నేను హీరో అయ్యాక నాకు ఫోన్ చేశారు. అయితే డేట్స్ లేవని చెప్పాను. కానీ, ‘సైకో’ చిత్రం చూశాక ఆయన అభిమానిగా మారిపోయాను. ఈ సినిమాలో మిష్కిన్ ఒక మంచి పనిచేశారు. బాగా నటించిన ఇద్దరు నటులకు, బాగా పనిచేసిన మరో ఇద్దరికి రూ.వెయ్యి చొప్పున బహుమతి ఇచ్చాడు. ఇది కేవలం డబ్బు మాత్రమే కాదు. ఎంతో విలువైన బహుమతి. ఈ సినిమా థ్రిల్లర్‌గా ఉంటుంది. కానీ, చిత్రీకరణ సమయంలో రొమాంటిక్ మూవీ అనిపించింది’ అని అన్నారు.
దర్శకుడు మిష్కిన్ మాట్లాడుతూ ‘విజయ్ సేతుపతితో సినిమా చేయాలని భావించాం. ‘సైకో’ చిత్రం తర్వాత విజయ్ సేతుపతితో కొన్ని గంటల పాటు సుధీర్ఘంగా మాట్లాడాను. ఆయన మంచి నటుడే కాదు. మంచి వ్యక్తి కూడా. ‘ట్రైన్’ ఒక పతనమైన మనిషి కథ. జీవితానికి అర్థం లేదని, అంతా అయిపోయిందని భావించేవాడే ఈ హీరో. విజయ్ సేతుపతి కాకుండా మరే ఇతర హీరో ఈ సినిమా చేయలేరు. విజయ్ సేతుపతి ఒక అగ్నిపర్వతం వంటివారు. ఈ సినిమాలో ఏ సన్నివేశం కూడా రెండో టేక్‌కు వెళ్ళలేదు’ అని అన్నారు.