గోదావరి యాస కోసం.. నాలుగు నెలలు రిహార్సల్స్ చేశా! రాజు వెడ్స్ రాంబాయి.. నేను చేయాల్సింది
ABN, Publish Date - May 06 , 2026 | 12:43 PM
సుమంత్ ప్రభాస్ కథానాయకుడుగా తెరకెక్కిన చిత్రం ‘గోదారి గట్టుపైన’ 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాకు చిత్ర విశేషాలు వివరించారు.
‘నేను పుట్టి పెరిగింది తెలంగాణలో... గోదావరి యాస కోసం దాదాపు నాలుగు నెలలు రిహార్సల్స్ చేశాను. అక్కడ పుట్టి పెరిగిన వారు విన్నప్పుడు కచ్చితంగా మనలాగే మాట్లాడుతున్నాడనే ఫీలింగ్ రావాలని ప్రయత్నించాను’ అని చెప్పారు హీరో సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas).
ఆయన కథానాయకుడుగా సుభాష్ చంద్ర (Subash Chandra) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గోదారి గట్టుపైన’ (Godari Gattupaina). రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. సినిమా ఈనెల 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సుమంత్ ప్రభాస్ మీడియాకు చిత్ర విశేషాలు వివరించారు. అంతేగాక షూటింగ్ రోజుల్లో అక్కడ రుచి చూసిన వంటకాల గురించి వివరించారు.
‘మేము ఫేమస్’ తర్వాత చాలా కథలు విన్నాను. కథను, ఎమోషన్స్‌ను కొత్తగా చెప్పే ఫిల్మ్ మేకర్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు సుభాష్ చంద్ర కలిశారు. ఆయన చెప్పిన ఈ కథ నాకు చాలా నచ్చింది. గోదారి నేపథ్య కథ అంటే నాకు ఛాలెంజ్‌గా అనిపించింది. ఇందులో ఆటో డ్రైవర్ క్యారెక్టర్ నాది’ అని చెప్పారు.
ఆ సినిమా.. నేను చేయాల్సింది
‘రాజు వెడ్స్ రాంబాయి’ కథను ఆ చిత్ర దర్శకుడు సాయిలు అన్న చెప్పారు. నాకు చాలా నచ్చింది. కానీ అప్పటికే ‘మేము ఫేమస్’ సినిమాను తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో చేశాను. మళ్లీ అదే చేస్తే రిపీట్ ఫీలింగ్ వస్తుందని సాయిలు అన్నకి చెప్పాను. ఆ కథ అఖిల్ చేశాడు. అతనికి హెల్ప్ అయ్యింది. ఇండస్ట్రీకి కొత్త ట్యాలెంట్ వచ్చింది. సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా మిస్ అయ్యానేమో అని నేను అనుకోవడం లేదు.