సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

చిరంజీవి తొక్కేశాడు ట్రోల్స్.. ఇచ్చిపడేసిన హైపర్ ఆది

ABN, Publish Date - Aug 21 , 2026 | 10:06 PM

మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు వేడుకలు మొదలయ్యిపోయాయి. ఎప్పటిలానే.. మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి ఆగస్టు 20 రాత్రి మెగా మహోత్సవం ఈవెంట్ ని నిర్వహించారు.

Hyper Aadi

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) 71వ పుట్టినరోజు వేడుకలు మొదలయ్యిపోయాయి. ఎప్పటిలానే.. మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి ఆగస్టు 20 రాత్రి మెగా మహోత్సవం ఈవెంట్ ని నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రముఖ నటుడు, కమెడియన్ హైపర్ ఆది (Hyper Aadi) చేసిన ప్రసంగం ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. వేదికపై ఉన్న దర్శకుడు బాబీ, జానీ మాస్టర్, నాగేంద్ర, ఆటా సందీప్, రమేష్‌లకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆది, 90స్ జనరేషన్ ప్రేక్షకులందరినీ ఉద్దేశించి ఎంతో భావోద్వేగంగా మాట్లాడాడు.


తమ జనరేషన్ చందమామని చూస్తూ తిందని, చిరంజీవిని చూస్తూ పెరిగిందని, పవన్ కళ్యాణ్ ని చూస్తూ అరిచిందని, రామ్ చరణ్ ని చూస్తూ గర్వపడుతోందని తెలిపాడు. చిన్నతనంలో టీవీ లేక పక్కింటికి వెళ్లి వేరే సినిమాలైతే మధ్యలోనే వచ్చేసేవాళ్లమని, కానీ చిరంజీవి సినిమా అయితే చివరిదాకా చూసేవాళ్లమని గుర్తుచేశాడు. గ్రీటింగ్ కార్డ్స్ నుంచి హాస్టల్ రూముల్లో పోస్టర్ల వరకు మెగాస్టార్‌తో ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ, ఈ జనరేషన్‌కి చిరంజీవి ఒక హీరో కావచ్చు కానీ తమకు మాత్రం వన్ అండ్ ఓన్లీ హీరో అని స్పష్టం చేశాడు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ సహా మెగా హీరోలందరికీ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ, వాళ్లందరికీ తెగిన మొట్టమొదటి టికెట్ మాత్రం మెగాస్టార్ అభిమానిదేనని గుర్తుచేశాడు.


క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ రికార్డులను వైభవ్ సూర్యవంశీ, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, ధోనీలు దాటేసినట్లే, సినిమాల్లో కూడా రికార్డులు మారుతుంటాయి గానీ.. చిరంజీవి డాన్స్, నటన, ఫ్యాన్ బేస్, సహాయ గుణం లాంటి రికార్డులను మాత్రం ఇప్పటివరకు ఎవరూ టచ్ కూడా చేయలేకపోయారని, కేవలం అనుసరించారంతేనని అన్నాడు. 'స్వయంకృషి', 'విజేత', 'ఆపద్బాంధవుడు', 'మగమహారాజు' అనేవి కేవలం సినిమా పేర్లు కావని, చిరంజీవి జీవిత సత్యాలని పేర్కొన్నారు. ఇతర హీరోల అభిమానులు వసూళ్ల గురించి కొట్టుకుంటే, మా హీరో ఇన్ని కోట్లు పంచాడు అని విలువలు మాట్లాడుకునే స్థాయికి తెచ్చింది మెగాస్టారేనని కొనియాడాడు.


అంతేకాకుండా, మహామహులైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వేటూరి.. తమ సాంగ్స్ కి మెగాస్టార్ మాత్రమే న్యాయం చేస్తారని చెప్పారని.. కే. బాలచందర్.. రజనీకాంత్ ప్లస్ కమల్ హాసన్ కలిపితే చిరంజీవి అని అన్నారని, అమితాబ్ బచ్చన్ .. కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా మెగాస్టార్ అని తెలిపినట్లు చెప్పాడు. అంతేకాకుండా మహేష్ బాబు, ప్రభాస్ అందరూ మెగాస్టార్‌ను ఆదర్శంగా భావిస్తారని చెప్పాడు. అలాగే పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామివారి పాదాలు తాకి, డిప్యూటీ సీఎం అయినా తర్వాత తిరిగొచ్చి తాకిన ఏకైక పాదాలు మెగాస్టార్ వేనని గుర్తుచేశాడు. ఇలా తోపులందరూ కలిసి డిసైడ్ చేసిన తోపే చిరంజీవి అని చెప్పుకొచ్చాడు. ఇక కరోనా టైంలో సీసీసీ ద్వారా కార్మికులను ఆదుకోవడం, ఆరంభంలో తన మిత్రులు సుధాకర్, హరిప్రసాద్, నారాయణరావులను ప్రొడ్యూసర్లుగా చేసి 'యముడికి మొగుడు' నిర్మించడం ఆయన హెల్పింగ్ నేచర్‌కు నిదర్శనమన్నాడు. చిరంజీవిది కర్ణుడి మనస్తత్వమైతే, సురేఖమ్మది డొక్కా సీతమ్మ మనస్తత్వమని ప్రశంసించాడు. 'బలగం', 'కోర్టు', 'అర్జున్ సురవరం' వంటి చిన్న సినిమాలకు అండగా నిలిచిన వ్యక్తి ఆయనేనని, ఇండస్ట్రీలో ఎవరికి కష్టం వచ్చినా జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి అనే చెట్టు కిందకే వెళ్తారని స్పష్టం చేశాడు.


చివరగా, గత నెల రోజులుగా చిరంజీవి తొక్కేశాడు అని నెగెటివ్ ప్రచారం చేస్తున్న వారికి ఆది ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు. చిరంజీవి వేటిని తొక్కారో వివరిస్తూ.. ఎవరూ నంబర్ వన్‌గా ఉండలేరు అనే ఇతరుల అహాన్ని తొక్కారు. బాలీవుడ్ కలెక్షన్ల భ్రమలను, డాన్స్ అంటే కేవలం నడవడమే అనుకునే ఆలోచనలను తొక్కారు. కొడుకు సక్సెస్ అవ్వడు అనుకునే భావనలను తొక్కుకుంటూ ఆయన అగ్ర పీఠాన కూర్చున్నారని అన్నాడు. ఎంతమంది ఆయనమీద ఏడ్చినా అది ఆయన సాయంత్రం సరదాగా వేసుకునే పంచె అంచును కూడా కదలదని, స్పైడర్‌మ్యాన్ సినిమాలో ఐటెం సాంగ్ లేదని ఏడ్చినట్లే ఈ నెగెటివిటీ కూడా ఉంటుందని ఎద్దేవా చేశాడు. ఇండస్ట్రీకి ఎన్ని ఏళ్లు వచ్చినా.. చిరంజీవికే వంద ఏళ్లు వచ్చినా సింహాసనం మీద కూర్చొనే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది .. ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది' అంటూ ఆది తన ప్రసంగాన్ని ముగించాడు.

Updated Date - Aug 21 , 2026 | 10:10 PM