IMAX: హైదరాబాద్‌లోకి ఐమాక్స్ రీ ఎంట్రీ.. 11 ఏళ్ల తర్వాత గ్రాండ్ ఓపెనింగ్! రెండేండ్లలో మరిన్ని భారీ స్క్రీన్లు!
ABN, Publish Date - Nov 19 , 2026 | 05:06 PM
దాదాపు 11 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో ఐమాక్స్ స్క్రీన్ అందుబాటులోకి రానుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ఏఎంబీ విక్టరీ సినిమాస్‌లో డిసెంబర్ 18న ప్రారంభించే అవకాశాలున్నాయి..
సినిమా చూడటం అంటేనే ఓ ప్రత్యేకమైన అనుభూతి అందునా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోనైతే ఇక చెప్పనవసరమే లేదు. భారీ కటౌట్లు, అభిమానుల కోలాహలం, అత్యాధునిక మల్టీప్లెక్సులు.. ఇలా సినిమా సంస్కృతికి భాగ్యనగరం ఎప్పుడూ ప్రత్యేక స్థానంలోనే ఉంటుంది. అయితే నగరంలో ఎన్ని అద్భుతమైన స్క్రీన్లు అందుబాటులో ఉన్నా.. ఐమాక్స్ థియేటర్ లేకపోవడం మాత్రం సినీ అభిమానులను చాలాకాలంగా నిరాశ పరుస్తోంది. ఇప్పుడు ఆ లోటు తీరబోతోంది. దాదాపు 11 ఏళ్ల విరామం తర్వాత హైదరాబాద్‌లో మళ్లీ ఐమాక్స్ స్క్రీన్ (IMAX Hyderabad) అందుబాటులోకి రానుంది.
హైదరాబాద్‌లోని ప్రముఖ సినిమా కేంద్రం ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో కొత్తగా నిర్మిస్తున్న ఏఎంబీ విక్టరీ సినిమాస్ (AMB Victory Cinemas) లో ఈ ఐమాక్స్ స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నారు. గతంలో సుదీర్ఘ చరిత్ర ఉన్న సుదర్శన్ 70ఎంఎం థియేటర్ ఉన్న ప్రాంతంలో ఈ అత్యాధునిక మల్టీప్లెక్స్ రూపుదిద్దుకుంటోంది. ఏషియన్ సినిమాస్‌తో పాటు టాలీవుడ్ అగ్ర నటులు మహేశ్ బాబు, వెంకటేశ్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మితమవుతోంది. మొత్తం ఏడు స్క్రీన్లతో అందుబాటులోకి రానున్న ఈ మల్టీప్లెక్స్‌లో ఐమాక్స్ విత్ లేజర్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
అంతేకాకుండా 4డీఎక్స్ స్క్రీన్‌తో పాటు మరో ఐదు సాధారణ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అత్యాధునిక ప్రొజెక్షన్, సౌండ్ టెక్నాలజీతో భారీ సినిమాలను సరికొత్త అనుభూతితో చూసే అవకాశం ప్రేక్షకులకు లభించనుంది. కాగా ఈ మల్టీప్లెక్స్‌ను డిసెంబర్ 18, 2026న ప్రారంభించడానికి సర్వం సిద్ధం చేసినట్లు సమాచారం. హాలీవుడ్ భారీ చిత్రం 'డ్యూన్: పార్ట్ త్రీ' ఈ స్క్రీన్‌పై ప్రదర్శితమయ్యే తొలి సినిమాగా ఉండవచ్చని చాలా కాలంగా ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ప్రారంభ తేదీ, తొలి ప్రదర్శనపై యాజమాన్యం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అయితే.. ఇప్పటికే హైదరాబాద్‌లో పెద్ద తెరపై సినిమా చూసేందుకు అద్భుతమైన థియేటర్లకు కొదవలేదు. ఖైరతాబాద్‌లోని ప్రసాద్స్ పీసీఎక్స్, నార్సింగిలోని అల్లు సినిమాస్ డాల్బీ స్క్రీన్, వనస్థలిపురంలోని ఏఆర్టీ ఎపిక్ స్క్రీన్, కూకట్‌పల్లిలోని లేక్‌షోర్ మాల్ పీఎక్స్ఎల్ స్క్రీన్ ప్రేక్షకులకు లేటెస్ట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తున్నాయి. అంతేగాక అమీర్‌పేటలోని ఏఏఏ సినిమాస్ లక్సాన్ స్క్రీన్, గచ్చిబౌలిలోని ఏఎంబీ సినిమాస్ స్క్రీన్ 1 కూడా భారీ చిత్రాల ప్రదర్శనకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వీటితో పాటు బాలానగర్‌లోని మైత్రీ విమల్, దిల్‌సుఖ్‌నగర్‌లోని మైత్రీ శివ గంగా, మియా పూర్ సాయి రంగా, జీడిమెట్ల రంగా, మల్కాజిగిరి సాయిరాం వంటి సింగిల్ స్క్రీన్ థియేటర్లు సైతం న్యూ ఇంప్రూవ్‌డ్ టెక్నాలజీతో అద్భుతమైన మూవీ ఎక్స్పీరియన్స్ అందించేందుకు సిద్దమయ్యాయి.
ఇన్ని అత్యాధునిక స్క్రీన్లు ఉన్నప్పటికీ ఐమాక్స్ అనుభూతి మాత్రం నగరంలో అందుబాటులో లేకపోవడం పెద్ద లోటుగా ఉండేది. గతంలో ప్రసాద్స్‌లో ఐమాక్స్ స్క్రీన్ ఉండేది. అయితే ఆ తర్వాత అక్కడ ఐమాక్స్ ప్రదర్శనలు నిలిచిపోవడంతో భారీ హాలీవుడ్ చిత్రాలను ఆ ఫార్మాట్‌లో చూడాలనుకునే అభిమానులు ఇతర నగరాల వైపు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఏఎంబీ విక్టరీ రూపంలో ఆ ఎదురుచూపులకు తెరపడనుంది. ఇదే సమయంలో హైదరాబాద్‌లో భవిష్యత్తులో మరిన్ని భారీ స్క్రీన్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి, ఏషియన్ గ్రూప్ భాగస్వామ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ స్క్రీన్ ఏర్పాటు చేయాలనే ప్రణాళికపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అలాగే హకీంపేటలో మరో ఐమాక్స్ స్క్రీన్ నిర్మాణం జరుగుతున్నట్లు సమాచారం. విప్రో సర్కిల్ ప్రాంతంలో అపర్ణ సినిమాస్ ఆధ్వర్యంలో మరో ఐమాక్స్ స్క్రీన్ రానుందనే ప్రచారం కూడా వినిపిస్తోంది. ఇవన్నీ కార్యరూపం దాలిస్తే రాబోయే రెండేళ్లలో హైదరాబాద్ సినిమా ప్రదర్శన రంగంలో దేశంలోనే అత్యంత కీలకమైన నగరంగా మరింత ఎదిగే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఈ ఏడాది చివరలో రానున్న డ్యూన్3, అవెంజర్స్, వంటి హాలీవుడ్ చిత్రాలతో పాటు వచ్చే ఏడాది విడుదల కానున్న వారణాసి, ఫౌజీ, డ్రాగన్, స్పిరిట్, రాకా వంటి భారీ చిత్రాలను అత్యాధునిక స్క్రీన్లపై వీక్షించేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినీ అభిమానుల ఇన్నాళ్ల నిరీక్షణకు ఎండ్ కార్డ్ పడడంతో ఇకపై భారీ విజువల్ సినిమాల కోసం ఇతర నగరాలకు వెళ్లాల్సిన పని తప్పినట్లే.