ధురంధర్.. రాసి పెట్టుకో! వస్తుంది వారణాసి.. తెస్తుంది కలెక్షన్ల సునామీ
ABN, Publish Date - Mar 23 , 2026 | 07:48 PM
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దురంధర్-2 సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. అయితే ఈ ఘనతలను తిరగరాసే మరో భారీ చిత్రం వచ్చే ఏడాది లైన్లో ఉంది.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దురంధర్-2 (Dhurandhar) సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.761 కోట్ల వసూళ్లను దాటేసింది. రెండో వీకెండ్ ముగిసే సమయానికి ఈ చిత్రం వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. లాంగ్ రన్ లో రూ.2 వేల కోట్ల మైలురాయిని కూడా ఈ సినిమా అందుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో ఎన్నేళ్లుగానో చెక్కుచెదరకుండా ఉన్న రికార్డులన్నీ ఈ సినిమా ధాటికి తుడిచి పెట్టుకుపోతున్నాయి. ఈ స్థాయి వసూళ్లను చూసి సినీ విశ్లేషకులతో పాటు సామాన్య ప్రేక్షకులు సైతం విస్మయానికి గురవుతున్నారు.
అయితే ఈ రికార్డులన్నీ 'దురంధర్-2' ఖాతాలో ఎంతో కాలం భద్రంగా ఉంటాయని చెప్పలేం. ఈ ఘనతలను తిరగరాసే మరో భారీ చిత్రం వచ్చే ఏడాది లైన్లో ఉంది. రాజమౌళి (SS Rajamouli), మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో వస్తున్న వారణాసి (Varanasi) చిత్రం విడుదలయ్యాక ఈ రికార్డులన్నీ గల్లంతవ్వడం తథ్యం. ఆ సినిమాకు కనీసం యావరేజ్ టాక్ వచ్చినా సరే, ప్రస్తుత వసూళ్లు దాని ముందు చాలా చిన్నవిగా అనిపిస్తాయి. గరిష్టంగా మరో ఏడాది పాటు మాత్రమే దురంధర్ నంబర్ వన్ స్థానంలో ఉండే అవకాశం ఉంది. వారణాసి రాకతో బాక్సాఫీస్ లెక్కలన్నీ పూర్తిగా మారిపోతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే 'వారణాసి' చిత్రానికి ఉన్న క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. రాజమౌళి సినిమా అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి సినీ ప్రేమికుడు థియేటర్‌లో చూడాలని ఆరాట పడతారనే విషయం అందరికీ విదితమే. దురంధర్-2 సినిమాకు మంచి హైప్ ఉన్నప్పటికీ, వారణాసి రేంజ్ అందుకు సరితూగదు. ఈ చిత్రం దేశంలోని అన్ని ప్రధాన భాషల్లో ఏకకాలంలో విడుదల కానుండటంతో పాటు, ప్రతి చోటా ఒకే రకమైన ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఓపెనింగ్స్ విషయంలోనే కాకుండా, ఓవరాల్ వసూళ్లలోనూ ఎవరూ ఊహించని సరికొత్త బెంచ్ మార్కులను ఈ సినిమా సెట్ చేయబోతోంది.
ముఖ్యంగా పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమాకు ఉన్న బజ్ ఓ రేంజ్ లో ఉంది. ఓవర్సీస్ మార్కెట్‌లో ఇప్పటి వరకు లేని విధంగా భారీ వసూళ్లు వస్తాయని భావిస్తున్నారు. టికెట్ల ధరలు కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉండటం వల్ల బాక్సాఫీస్ నంబర్స్ కళ్లు చెదిరేలా ఉండబోతున్నాయి. ఈ ఏడాది 'రామాయణం' వంటి భారీ చిత్రాలు పోటీలో ఉన్నప్పటికీ, రీచ్ పరంగా వారణాసిదే పైచేయిగా కనిపిస్తోంది. అందుకే దురంధర్ నిర్దేశించే రూ.2 వేల కోట్ల టార్గెట్ కూడా రాజమౌళి-మహేష్ బాబుల సినిమాకు చాలా చిన్న లక్ష్యంగా మారే అవకాశం ఉంది.