సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

CBFC Data Leak: అంగట్లో.. విడుదలవ్వని 500 సినిమాల వివరాలు

ABN, Publish Date - Oct 26 , 2026 | 07:05 AM

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీ ఎఫ్సీ)లో భారీ డేటా లీక్ జరిగింది.

CBFC Data Leak

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీ ఎఫ్సీ)లో భారీ డేటా లీక్ (CBFC Data Leak) జరిగింది. ఆ సంస్థకు చెందిన ఈ-సినీ ప్రమాణ్ వెబ్‌సైట్ నుంచి దాదాపు 500 కొత్త సినిమాలకు చెందిన సున్నిత సమాచారాన్ని తస్కరించి లాభాపేక్ష లేని డిజిటల్ లైబ్రరీ అయిన ఇంటర్నెట్ ఆర్కైవ్స్ ఉంచారని జాతీయ మీడియా ఆదివారం వెల్లడించింది. వీటిలో సినిమాలను థియేటర్లలో విడుదల చేసే అనుమతి పత్రాల కోసం నిర్మాతలు సమర్పించిన షూటింగ్ స్క్రిప్టులు, కట్ ఆర్డర్స్, డిస్ట్రిబ్యూటర్లతో చేసుకున్న ఒప్పందాల వివరాలకు సంబంధించిన ఫైళ్లు ఉన్నాయని తెలిపింది.

సినిమాలకు సెన్సార్ అనుమతి కోసం నిర్మాతలు ఈ-సినీప్రమాణ్ ( E-Cinepramaan) పోర్టల్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. సర్టిఫికేష న్‌కు అవసరమైన అన్ని పత్రాలను అందులోనే అప్లోడ్ చేస్తారు. వీటిలో సినిమాకు మూలమైన స్క్రిప్టులు కూడా ఉంటాయి. తాజాగా లీకైన వివరాల్లో విదేశాలకు చెందిన 'ది సీక్రెట్ ఏజెంట్', 'గుడ్లక్ హ్యావ్‌ఫ‌న్ డోన్ట్ డై' తదితర సినిమాల విడుదల కోసం మనదేశంలోని డిస్ట్రిబ్యూటర్లతో చేసుకున్న ఒప్పంద పత్రాలు కూడా ఉండటం గమనార్హం.

ఈ వివరాలన్నీ బహిర్గతం కావటంతో నిర్మాతలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. అయితే, లీకైన వివరాలను ఎవరూ తస్కరించినట్లు ఆధారాలు లేవని సీబీఎఫ్‌సీ తెలిపింది. ఈ-సినీ ప్రమాణ్ వెబ్‌సైట్ భద్రతపై సమీక్ష నిర్వహిస్తున్నామని, డేటా లీక్ పై సైబర్ భద్రత విభాగానికి ఫిర్యాదు చేశామని పేర్కొంది.

Updated Date - Oct 26 , 2026 | 07:17 AM