Hreem: పోస్ట్ ప్రొడక్షన్ లో 'హ్రీం'
ABN, Publish Date - Jan 28 , 2026 | 01:01 PM
హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న 'హ్రీం' సినిమా షూటింగ్ పూర్తయ్యింది. రాజేశ్ రావూరి దర్శకత్వంలో ఈ సినిమాను శివ మల్లాల నిర్మిస్తున్నారు.
తెలుగు బీజాక్షరాల్లో ‘హ్రీం’ (Hreem) అనే అక్షరానికి ఎంతో ఉన్నతమైన విలువలతో కూడిన అర్థం ఉంది. ‘హ్రీం’ అనే ఒక్క బీజాక్షరంలో ‘హ’, ‘ర’, ‘ఈ’, ‘మ’ అనే అక్షరాలున్నాయి. హ అంటే ధర్మం, ర అంటే అర్థం, ఈ అంటే కామం, మ అంటే మోక్షం! ‘హ్రీం’ అంటే ధర్మార్ధ కామ మోక్షాలు కలగలిసిన బీజాక్షరం. ఇప్పటివరకు ఎక్కడా చెప్పని ఒక యదార్థ గాథను ఆధారంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
శివమ్ మీడియా పతాకంపై శివ మల్లాల (Siva Mallala) నిర్మిస్తున్న ‘హ్రీం’ సినిమాలో నూతన నటీనటులు పవన్ తాత (Pawan Tatha), డాక్టర్ చమిందా వర్మ జంటగా నటించారు. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం వరంగల్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది.
సుజాత మల్లాల సమర్పకురాలిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు రాజేశ్ రావూరి (Rajesh Rapoori) దర్శకుడు. వరంగల్ దగ్గరలోని పెద్ద పెండ్యాల గ్రామంలో తొలి షెడ్యూల్, హైదరాబాద్ హెచ్‌యంటీ కాలనీలోని ఫారెస్ట్ లొకేషన్స్‌లో సెకండ్ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది చిత్రం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో తనికెళ్ల భరణి (Thanikella Bharani), రాజీవ్ కనకాల (Rajeev Kanakala), బెనర్జీ, భద్రం, అనింగి రాజశేఖర్ (శుబోదయం సుబ్బారావు), త్రిపురనేని శ్రీవాణి, పూజారెడ్డి, వనితా రెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రలను పోషించారు.